పవన్ కల్యాణ్.. డిసెంబరు 2వ తేదీనుంచి నాలుగురోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులతో కూడా పవన్ సమావేశం అవుతారు. వారి కష్ట సుఖాలు తెలుసుకుంటారు. కృష్ణ గుంటూరు జిల్లాల్లో 2వ తేదీన, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 3,4,5 తేదీల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ సంగతి ఇదివరకే ప్రకటించారు.
ఇవి ద్వంద్వప్రమాణాలు కావా..
పవన్ టూర్ సందర్భంగా మీడియా మిత్రులందరూ రావాలని ఒక ఆహ్వానం పంపారు. ఇలా తన కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ మీడియాను ఆహ్వానించడం చిత్రమైన పరిణామంగా కనిపిస్తోంది. కొవిడ్ ప్రబలుతున్న రోజుల్లో మీడియా సమావేశాలను కూడా చాలా మంది నాయకులు ఎవాయిడ్ చేస్తున్నారు. వీలైనంత వరకు పత్రికా ప్రకటనలు పంపడం, వీడియోలు లైవ్ లో ఇస్తూ మాట్లాడడం చేస్తున్నారు. పత్రికల్లో, చానెళ్లలో కవరేజీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూనే ఉంది. ఇలాంటి జాగ్రత్తలను ఎవ్వరూ తప్పుపట్టడం లేదు కూడా. కొవిడ్ ప్రబలుతున్న సమయంలో.. అనేక మంది నాయకులు, జర్నలిస్టులు కూడా కొవిడ్ బారిన పడుతూ వచ్చిన నేపథ్యంలో.. ఈ జాగ్రత్తలను అందరూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు.
ఆ మాటకొస్తే కొవిడ్ జాగ్రత్తల విషయంలో పవన్ కల్యాణ్ కూడా ఎంతో అప్రమత్తంగా ఉన్నారనే చెప్పాలి. చాతుర్మాస దీక్షలో ఉన్నంతకాలం, మరో రకంగా చెప్పాలంటే వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి మొదలయ్యే వరకు పూర్తిగా ఫాం హౌస్ కు మాత్రమే పరిమితం అయిన పవన్ కల్యాణ్, పలు అంశాలపై అక్కడినుంచే తన వారితోనే వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఎడిటింగ్ కూడా చేయించి.. అన్ని ఛానెళ్లకు పంపేవారు. పత్రికా ప్రకటనలను రిలీజ్ చేస్తూ వచ్చారు తప్ప.. ఎన్నడూ విలేకర్లను తన వద్దకు కూడా రానివ్వలేదు. ఈ జాగ్రత్తలు అన్నీ కూడా మనం అర్థం చేసుకోదగినవే.
మంగళగిరికి కూడా రానివ్వలేదే
అదే సమయంలో వకీల్ సాబ్ షూటింగ్ మొదలయ్యాక కూడా పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు కూడా మీడియాను అనుమతించలేదు. సమావేశాల్లో మాట్లాడే విషయాలు, వీడియోలు అన్నీ.. వారి పార్టీ మీడియా విభాగం వారు అందరికీ పంపారు తప్ప… విలేకర్లను రానివ్వలేదు. కొవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో మీడియా వారిని అనుమతించడం లేదని, అందరూ సహకరించాలని ముందే విజ్ఞప్తి చేశారు. పత్రికల వారు కూడా సహకరించారు.
అమరావతి రైతులను కూడా పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని వారితో మాట్లాడారే తప్ప.. తాను శిబిరం వద్దకు కూడా వెళ్లలేదు. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ పాటించిన కొవిడ్ జాగ్రత్తల పరిధిమీరి.. ప్రజల్లోకి వెళుతున్నారు. నివర్ తుపాను బాధితులను పరామర్శించలేని ఆయనలోని ‘కన్సర్న్’ అందుకు పురిగొల్పిందని అనుకోవచ్చు.
అంతవరకు ఓకే గానీ.. ఆయన పర్యటనకు మీడియా మిత్రులను ఆహ్వానించడం ఎందుకో అర్థం కావడం లేదు. మంగళగిరి కార్యాలయంలో పార్టీ సమావేశాల వివరాలు పంపినట్టే.. ప్రకటనలు, ఫోటోలు వీడియోలు.. ఆయన టీమ్ ఎప్పటికప్పుడు అందరికీ పంపేస్తే సరిపోతుంది.
పవన్ కల్యాణ్ వస్తే.. సహజంగానే జనం ఎక్కువగా గుమి కూడుతారు. మీడియాను అనుమతిస్తే.. అందరూ పోలోమని వచ్చేస్తారు. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ అనే జాగ్రత్త మంటగలిసిపోతుంది. ఇన్నాళ్లు ఇంత జాగ్రత్తగా ఉన్న ఆయన ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పవన్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మీడియాని ఆహ్వానించడం సంగతి పక్కన పెట్టి.. వారు రాకపోయినా వివరాలు, ఫుటేజీ మొత్తం అందే ఏర్పాట్లు చేస్తే కొవిడ్ జాగ్రత్తలను గౌరవించినట్లు ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.