హైదరాబాద్ వరదలు రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముంపు ప్రాంతాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న వదరల గురించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణను పాలించిన కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాల పాపాలను మేము ఇప్పుడు మోస్తున్నామని విమర్శించారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు మమ్ములను తిడుతున్నారని పేర్కొన్నారు. నాలాలు-చెరువులపై కట్టిన నిర్మాణాలు తమ ప్రభుత్వంలో కట్టినవి కావని తెలిపారు. గత ప్రభుత్వంలోనే ఈ కట్టడాలు వెలిశాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాపం కడగాలి అంటే లక్ష ఇండ్లను తీసేయాలని ఆయన తెలిపారు. లక్ష ఇండ్లను తీసే పరిస్థితి ఇప్పుడుందా అని ఆయన ప్రశ్నించారు.
ఒక్క రూపాయి ఇవ్వని మంత్రి..
కేంద్ర మంత్రి హైదరాబాద్ నగరమంతా తిరిగి ఒక్క రూపాయి ఇవ్వలేదని కిషన్‌రెడ్డిని ఉద్ధేశించి తలసాని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటే వరదల అంశాన్ని ప్రధాని కలుగజేసుకోవాలని కోరారు. తక్షణ సాయం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కూడా ఇక టైమ్ వేస్ట్ పనేనని ఆయన ఎద్దేవా చేశారు.
నాలాల ఆక్రమణలపై తెలంగాణ ప్రాంతాల నాయకుల మాటలను గతంలో ఏ ప్రభుత్వాలు వినలేదని, ఈ ప్రాంతమంటే సవితి తల్లి ప్రేమ వారికి ఉండేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ తమకు గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ చూడని వరదలను తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటుందని తెలిపారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతల పాలనలోనే మునిగిన నిర్మాణాలు, కట్టడాలు కట్టారని తెలిపారు. వరద ముంపు ప్రజలకు సాయం ప్రకటించిన సిఎంకు ప్రజల తరుపున తలసాని కృతజ్ఞతలు తెలిపారు. అంతే ధీటుగా అధికార పార్టీపైన కూడా కాంగ్రెస్, బిజెపి ఇతర పార్టీలు వరదల విషయంలో విమర్శలు గుప్పిస్తున్నాయి.