ఒకవైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల ఆందోళనలు మిన్నంటుతున్న కొద్దీ.. మోడీ సర్కారులో కంగారు పుడుతోందేమోనని అనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో రైతులను ఉద్దేశించి.. ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించడం.. దేశవ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ఆయన మరో కొత్త ప్రసంగానికి పూనుకోవడం.. ఇవన్నీ కూడా రైతుల ఆందోళన మీదినుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంగానే అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఇవి మాత్రమే కాదు.. రైతుల సందేహాలకు సూటిగా స్పందించకుండా, వారి అసలైన డిమాండ్లను పట్టించుకోకుండా.. ప్రహసనం నడిపిస్తున్నారు.
రివర్స్ దీక్షల స్ట్రాటజీ
మోడీ సర్కారు అనుసరిస్తున్న కొన్ని వ్యూహాలను గమనిస్తోంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే గుర్తుకు వస్తున్నాయి. ఇక్కడ అమరావతి రైతుల పోరాటాన్ని పట్టించుకోకుండా, అలాగని వారి పోరాటాన్ని అణిచివేయలేదు. తమషాగా.. వారి డిమాండుకు వ్యతిరేక దీక్షలను ప్రారంభించారు. మూడు రాజధానులు కావాలంటూ పోటీ శిబిరాలు వెలిశాయి. వీటి వెనుక అధికార పార్టీ పెద్దలే ఉంటారన్నది అందరికీ తెలిసిన సంగతి.
అచ్చంగా ఇదే స్ట్రాటజీని కేంద్రంలో బీజేపీ కూడ అవలంబిస్తోంది. అన్నదాతలు వ్యవసాయ చట్టాల రద్దుకోసం డిమాండ్ చేస్తోంటే. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో పోటీ దీక్షలు ప్రారంభించారు. ఈ వ్యవసాయ చట్టాలే కావాలంటూ ఈ దీక్షలు నడుస్తున్నాయి. ఇవన్నీ ఫేక్ దీక్షలే అనే వాదన వినిపిస్తోంది. అదే తరహాలో భారతీయ కిసాన్ సంఘ్ నేతలు మంత్రి తోమర్ ను కలవడం.. వ్యవసాయ చట్టాలకు కితాబులివ్వడం ఇంకో తాజా కామెడీ.
కిసాన్ మజ్దూర్ సంఘ్(బాగ్ పత్) అనేది భాజపా సంస్థ. ఈ సంస్థకు చెందిన 60 మంది రైతు ప్రతినిధి బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసారు. అరగంటకుపైగా సమావేశం అయ్యారు.
వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ రైతులు లేఖ ఇచ్చారని, ఎన్ని ఒత్తిడులు వచ్చినా.. వ్యవసాయ చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేయవద్దని ఆ రైతులు కోరారని తోమర్ ఆ తర్వాత ప్రకటించారు.
ఒకవైపు రైతులంతా ఏకంగా మూడు చట్టాలను రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని డిమాండ్ చేస్తుండగా.. అసలు సవరణలు కూడా చేయవద్దని రైతులు తనకు విన్నవించినట్లుగా తోమర్ ప్రకటించడం పెద్ద కామెడీ. పనిలో పనిగా తోమర్ కాంగ్రెస్ మీద కూడా సెటైర్లు వేశారు.
రాహుల్ గాంధీ చెప్పిన దానిని కాంగ్రెస్ కూడా తీవ్రంగా పరిగణించదని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి రాహుల్ ఇచ్చిన సంతకాల్లో రైతుల సంతకాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు నుంచి సంతకం తీసుకోవడాని కాంగ్రెస్ నుండి ఎవరూ తమ వద్దకు రాలేదని రైతులు చెప్తున్నారన్నారు. తోమర్ దృష్టిలో రైతులు అంటే.. బీజేపీకి కొమ్ముకాసే, వారి వ్యవసాయ సంఘాల్లోని రైతులు మాత్రమే అన్న నిర్వచనం ఉన్నట్టుంది. రైతులందరూ కాంగ్రెస్ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నారనే నమ్మకం ఉండి ఉంటే.. బీజేపీ సర్కారు.. రాష్ట్రపతి భవన్ వద్దకు రైతుల ర్యాలీని ధైర్యంగా అనుమతించి ఉండాల్సింది. ఆ ధైర్యం లేకపోగా.. ఇలాంటి మాయోపాయాలతో.. రైతుల దీక్షలను పలుచన చేసే ప్రయత్నాలు ఎప్పటికీ సఫలమయ్యేవి కావు.