ఏపీలో వైసీపీ సర్కారు పాలన ప్రారంభమైన రోజుననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ను పునర్వవస్థీకరిస్తానని, కేబినెట్ లోకి కొత్త వారికి అవకాశం కల్పిస్తానని, పనితీరు సరిగా లేని వారిని తప్పించడం ఖాయమని.. ఈ విషయంలో ఇటు మంత్రులతో పాటు అటు ఎమ్మెల్యేలు కూడా సన్నద్ధంగా ఉండాలని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కేబినెట్ నుంచి తప్పిస్తే.. మారు మాట్లాడకుండా తప్పుకోవాల్సిందేనన్నట్లుగా ఆయన మంత్రుల వద్ద అంగీకార పత్రాలు కూడా తీసుకున్నట్లుగా నాడు వార్దలు వినిపించాయి. అనుకున్నట్లుగానే.. ఇప్పుడు జగన్ కేబినెట్ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో.. కేబినెట్ పునర్వవస్థీకరణకు సమయం ఆసన్నమైంది. దీంతో ఇప్పటికే కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా జగన్ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేబినెట్ లో ప్రస్తుతం 25 మంది ఉంటే.. వారిలో ఏకంగా 18 మందిని తప్పించి.. వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రుల పనితీరుతో పాటు ఆయా సామాజిక వర్గాల సమీకరణలను కూడా ముందేసుకుని కూర్చున్న జగన్ ఇప్పటికే తన కేబినెట్ పునర్వవస్థీకరణపై ఓ అంచనాకు వచ్చారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అవుటయ్యేది ఎవరు?
జగన్ కేబినెట్ నుంచి తప్పనిసరిగా ఉద్వాసనకు గురయ్యే వారి జాబితాలో డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరందరి పనితీరు ఆశించిన మేర లేదని జగన్ తేల్చేసినట్లుగా సమాచారం. వీరి స్థానంలో వీరి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకే కొత్తగా అవకాశం కల్పించాలని కూడా జగన్ నిర్ణయించారట. అంతేకాకుండా ఆయా సామాజిక వర్గాల సమీకరణలను పరిశీలిస్తే.. మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేశ్, ముత్తంశెట్టి శ్రీనివాస్ తదితరులను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జాబితాలోని మంత్రులు పనితీరులో మెరుగ్గానే రాణిస్తున్నా.. ఆయా సామాజిక వర్గాల నుంచి ఇతరులకు అవకాశం కల్పించాలంటే.. వీరిని తప్పించక తప్పదన్న దిశగా జగన్ కదులుతున్నారట. అయితే వీరిలో ఏ ఒక్కరిని కదిలించినా జగన్ కు వ్యతిరేకత ఎదురవుతుందన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు ఉన్నాయి. ఇక మరో ఆరుగురికి కూడా జగన్ ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రులు సీదిరి అప్పలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోచి సుచరిత, పినిపే విశ్వరూప్, అంజాద్ బాషా పేర్లు ఉన్నాయని సమాచారం.
ఇక కొత్తగా అవకాశం ఎవరికి..?
2019 ఎన్నికల ప్రచారంలో, అంతకుముందు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలువురికి మంత్రి పదవులు ఇస్తానని జగన్ చెప్పారు. ఇలాంటి వారి జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, జనసేనాని పవన్ కల్యాణ్ ను భీమవరంలో ఓడించిన గ్రంధి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా జగన్ తన తొలి కేబినెట్ లో అవకాశం కల్పించలేదు. అయితే పునర్వవస్థీకరణలో భాగంగా వీరిలో కనీసం ఇద్దరికైనా మంత్రి పదవులు ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాగా.. శ్రీనివాస్, నాగిరెడ్డిల్లో ఒకరికి పదవి ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాల, శ్రీశైలం ఎమ్మెల్యేలుగా ఉన్న శిల్పా రవికిశోర్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డిలు ఉన్నారు. శిల్పా, కాటసాని ఫ్యామీలీల నుంచి ఇద్దరేసీ ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి అవకాశం కల్పించాల్సందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకా చాలా మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ వంతు యత్నాలు సాగిస్తున్నారు.
ఇక మిగిలిన వార్గాల మాటేమిటంటే..?
ఇక ఎస్సీ సామాజిక వర్గం విషయానికి వస్తే.. జగన్ సొంత జిల్లాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, అనంతపురం జిల్లా శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ ఎమ్.తిప్పేస్వామిలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మంత్రి పదవి కోసం ఓ రేంజిలో యత్నిస్తున్నారు. ఇటీవలే ఆమె ఏకంగా జగన్ తోనే భేటీ వేయడం కూడా సంచలనంగా మారింది. ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు, బీసీ సామిజిక వర్గాలకు చెందిన దాడిశెట్టి రాజా(తుని), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు ( పిఠాపురం), జక్కంపూడి రాజా ( రాజానగరం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట)తో పాటు ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన తోట త్రిమూర్తులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతిలతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారట. మొత్తంగా కేబినెట్ నుంచి ఏకంగా 18 మందిని బయటకు పంపినా.. అదే స్థాయిలో కొత్త వారికి అవకాశం కల్పించినా.. ఇంకా ఆశావహులు చాలా మందే ఉన్నారు. మరి వారందరినీ జగన్ ఎలా శాంతపరుస్తారో చూడాలి.