సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి తామింకా రేసులోనే ఉన్నామని చాటింది చెన్నై సూపర్‌కింగ్స్. అయితే చెన్నై జట్టుకు అసలైన సవాలు ఈ రోజు (శనివారం) జరగబోయే మ్యాచ్‌లో ఎదురుకాబోతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో తలపడుతోంది. మరి, ఢిల్లీకి చెక్ పెట్టి ప్లే ఆఫ్స్ ఆశలను చెన్నై సజీవంగా ఉంచుకుంటుందేమో చూడాలి.
మరోవైపు ఢిల్లీ టీమ్ విజయోత్సాహంతో కదం తొక్కుతోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ రోజు జరుగబోయే మ్యాచ్‌లో చెన్నైని ఓడిస్తే ఢిల్లీ టీమ్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది. అయితే ఢిల్లీ టీమ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఈ రెండు టీమ్‌లూ ఈ రోజు రాత్రి 7:30 గంటలకు షార్జా అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. మరి, విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఢిల్లీ టీమ్ బలాలు
ఈ సీజన్‌లో ఢిల్లీ టీమ్ ఎన్నడూ లేనంత సాధికారికంగా ఆడుతోంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో టైటిల్ ఫేవరెట్‌గా మారింది. పృథ్వీ షా, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యార్, స్టోయినిస్ బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నారు. అశ్విన్, రబాడా, నోర్ట్జే బౌలింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. హర్షల్ పటేల్ కూడా కీలక ఆటగాడిగా మారాడు.
బలహీనతలు
ఢిల్లీ టీమ్‌ను గాయలు వేధిస్తున్నాయి. ఇప్పటికే బౌలర్లు ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా గాయల కారణంగా వైదొలిగారు. ఇటీవల గాయపడిన పంత్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగే స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఢిల్లీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే వికెట్ కీపర్ కూడా అయిన పంత్ లేకపోతే జట్టులో సమతౌల్యం దెబ్బతింటుంది. పంత్ గైర్హాజరీలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అయిన అలెక్స్ క్యారీని తీసుకోవాలి. టీమ్‌లో నలుగురికి మించి విదేశీ ఆటగాళ్లు ఉండకూడదు కాబట్టి కీలకమైన హెట్‌మేయర్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. దీంతో ఢిల్లీ తుది జట్టు కూర్పు కష్టంగా మారనుంది. ఇక, కీలక ఆటగాడు అజింక్యా రహానే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.
ఢిల్లీ టీమ్ (అంచనా)
పృథ్వీ షా, శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, అంజిక్యా రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రబాడా, నోర్ట్జే.
చెన్నై టీమ్ బలాలు
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పొందింది ధోనీ సేన. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై టీమ్ టాప్ ఫోర్‌లోకి వచ్చే ఛాన్సుంది. గత మ్యాచ్‌లో చెన్నై మిడిలార్డర్ సమష్టిగా రాణించింది. వాట్సన్, రాయుడు, ధోనీ, జడేజా, కర్రన్ బ్యాట్‌తో రాణించారు. బౌలింగ్‌లో కూడా సమష్టి ప్రదర్శన కనిపించింది. ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సత్తా చాటతాడు. అందరూ ఇదే విధంగా సమష్టి ప్రదర్శన చేస్తే చెన్నై టీమ్ ఢిల్లీని నిలువరించగలదు. డుప్లెసిస్‌తో పాటు కర్రన్‌ను ఓపెనింగ్ చేయించాలనే ఫ్లాన్ సత్ఫలితాన్ని ఇచ్చింది.
బలహీనతలు
చెన్నై టీమ్‌లో నిలకడ లోపిస్తోంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై టీమ్ గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలుపొందింది. ఇక, ఈ సీజన్‌లో ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై టీమ్ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఈ సీజన్‌లో తడబడుతున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపలేకపోతున్నాడు. ఇక, జట్టులో చాలా మంది రిటైర్ అయినవాళ్లు, కెరీర్ చివరి దశలో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఫాస్టెస్ట్ ఫార్మాట్‌లో చెన్నై టీమ్ వెనుకంజలో ఉంది.
మ్యాచ్ ఫేవరెట్
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చెన్నైతో పోల్చుకుంటే అన్ని విభాగాల్లోనూ ముందంజలో ఉంది. నిలకడగా రాణిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీకే విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని చెన్నై కృత నిశ్చయంతో ఉంది. కీలక ఆటగాళ్లు దూరమై ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లీ టీమ్‌ను ఓడించగలదేమో చూడాలి.











