ఏపీలో గురువారం ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీలకు స్థాన చలనంతో పాటు కర్ణాటక కేడర్ కు చెందిన పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి కర్నూలు జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. కన్నడ నాట మంచి ట్రాక్ రికార్డు కలిగిన సుధీర్ కుమార్ రెడ్డిని కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ చేసిన నేపథ్యంలో జిల్లాకు చెందిన వైసీపీ నేతలకు.. ప్రత్యేకించి ఇసుక మాఫియా, ఇతరత్రా దౌర్జన్యాలను పాల్పడుతున్న వారికి ఇక ఇబ్బందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈయన కోసం ఇద్దరు ఎస్పీల బదిలీ?
కర్నూలు జిల్లా ఎస్పీగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న ఫకీరప్పను అక్కడి నుంచి బదిలీ చేసి అనంతపురం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక అనంతపురం ఎస్పీగా కొనసాగుతున్న సత్య యేసుబాబును ఇంటెలిజెన్స్ లో ఖాళీగా ఎస్పీ గా నియమించారు. ఇక ఫకీరప్ప బదిలీతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా ఎస్పీ పోస్టును సుధీర్ కుమార్ రెడ్డితో భర్తీ చేశారు. సుధీర్ కుమార్ రెడ్డి కోసమే మిగిలిన ఇద్దరి ఎస్పీల బదిలీలు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ రెడ్డి కోసం ఆ జిల్లా వాసుల నిరసన
ఇక సుధీర్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే.. ఏపీకి చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన రెడ్డి.. 2010 కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి. తొలుత కర్ణాటకలోన భత్కల్ జిల్లా ఏఎస్పీగా, బీదర్, మండ్య జిల్లాల ఎస్పీగా పని చేశారు. దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆయన అక్కడి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. ఈ కారణంగానే ఆయనను అక్కడి నుంచి బదిలీ చేయగా.. ఆయన బదిలీని నిలుపుదల చేయాలంటూ ఆ జిల్లా వాసులు నిరసనలకు కూడా దిగారు. వృత్తి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న పేరున్న సుధీర్ కుమార్ రెడ్డి.. 2020లో ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చారు. మూడేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ డిప్యూటేషన్ ముగియగానే ఆయన తిరిగి కర్ణాటక కేడర్ కు వెళ్లాల్సి ఉంది. అప్పటిదాకా ఆయనను కర్నూలు జిల్లా ఎస్పీగానే కొనసాగిస్తారా? అన్న దిశగా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- పాఠాలకే గుణపాఠాలు నేర్పిన కుందనపు బొమ్మ.. ఐపీఎస్ చందనా దీప్తి