తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నెలకొన్న నీటి యుద్ధం తెలుగు రాజకీయాలను ఊపేస్తోంది. ఇలాంటి సమయంలోనే కర్ణాటకలో కూడా సాగు నీటి ప్రాజెక్టుల విషయంలోనే కొత్త తరహా యుద్ధం మొదలైపోయింది. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండ్య ఎంపీ సుమలత ఆరోపిస్తే.. నీటి వృధాను అడ్డుకోవాలంటే ప్రాజెక్టులకు అడ్డంగా పడుకోవాలంటూ కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుమార వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమలత.. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటం సరికాదని, తనపై కుమార చేసిన వ్యాఖ్యలపై అవసరమైతే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మొత్తంగా అక్కడ కూడా నీటి యుద్ధమే మొదలైందని చెప్పాలి.
కుమార కొడుకును ఓడించిన సుమలత
సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుమలత.. కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అంబరీష్ మరణిస్తే.. అప్పటికే రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న అంబరీష్ పాత్రను పోషించేందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమలత మండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడి నుంచి తనపై పోటీకి దిగిన కుమారస్వామి తనయుడు నిఖిల్ ను చిత్తుగా ఓడించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు బీజేపీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఆ ఎన్నికల నాటి నుంచి సుమలత, కుమారస్వామిల మధ్య రాజకీయ వైరం మొదలైందని చెప్పాలి.
కేఆర్ఎస్ డ్యామ్ వేదికగా మాటల యుద్ధం
తాజాగా తన నియోజకవర్గం పరిధిలోని కేఆర్ఎస్ డ్యామ్ కు పగుళ్లు వచ్చాయని, ఈ కారణంగా నీరు వృధాగా పోతోందని, మరమ్మతుల విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలిసినంతనే.. కుమారస్వామి అవసరం లేకున్నా చాలా వేగంగా స్పందించారు. సాగునీటి ప్రాజెక్టులను తానేదో కట్టించినట్టుగా సుమలత ఫోజులు కొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన కుమార.. నీటి వృధాను అడ్డుకునేందుకు సుమలత ప్రాజెక్టుకు అడ్డంగా పడుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ సుమలత.. కుమార నోరు అదుపులో పెట్టుకోకుంటే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సుమలత కామెంట్స్, కుమార కౌంటర్, దానికి తిరిగి సుమలత ప్రతి కౌంటర్ లు కన్నడ రాజకీయాల్లో కాక పుట్టించాయనే చెప్పాలి.
Must Read ;- జగన్‌తో షర్మిల ఢీ.. నమ్మశక్యంగా లేదే!