ఒక వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే ఘటనలే పాఠాలుగా మారతాయి.ఆ పాఠాలు నేర్చుకున్నవారు జీవితంలో ముందుకు వెళతారు.అదే ఆ ఫాఠాలకే గుణపాఠాలు నేర్పాలనే పట్టుదల ఉన్నవాళ్లు ఉన్నతస్థాయికి వెళతారు.రెండో కోవకే చెందుతారు చందనా దీప్తి. మెదక్ జిల్లా ఎస్పీగా చేస్తున్న ఆమెను చూస్తే..పెట్టి పుట్టిందేమో అనిపిస్తోంది.ఆమె మోములో కనపడే చిరునవ్వే ఆ ఆలోచన రావడానికి కారణం.కాని ఆమె ఈ స్థానానికి రావడం వెనక చాలా కథ ఉంది.. చాలా కృషి ఉంది.
5వ తరగతిలో జరిగిన ఘటనే స్ఫూర్తి
5వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిన ఘటన చందనా దీప్తికి స్ఫూర్తినిచ్చింది.చదువుకోవాలనే తపనను పెంచింది.ఇంటర్ లో ఉన్నప్పుడు ఎదురైన అవమానం ఆమెలో పట్టుదలను,కసిని రగిలించింది.కాదు అనేదాన్ని అవును అనిపించాలనే పంతంతో నిప్పుకణంలా చెలరేగిపోయింది.తను పెరిగాక.. తనకు తెలిసిన మరో ఘటన ఆమెకు కర్తవ్యాన్ని గుర్తు చేసింది.తనేం చేయాలో..తన వల్ల జరిగే మంచేంటో గుర్తించింది.భూమి గుండ్రంగా ఉన్నట్లు..మళ్లీ 5వ తరగతి సీన్ కొద్దిగా అటు ఇటుగా రిపీట్ అయింది..అది కూడా పోలీస్ అధికారి అయ్యాక.. అది మరింత స్ఫూర్తినిచ్చింది. చందనా దీప్తి తల్లి విజయలక్ష్మి ఎమ్మెస్సీ, బీఈడీ చేశారు.తండ్రి జకర్యా మైనింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్‌గా చేశారు.బేసిక్‌గా జియాలజిస్ట్.ఇద్దరూ కష్టపడి పని చేసేవారే.ఆయన ఉద్యోగం రీత్యా రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, ఢిల్లీలలో చందనా దీప్తి చదువుకుంది.
టీచర్ ఇచ్చిన సమాధానంతో..
5వ తరగతిలో జరిగిన ఘటన ఏంటంటే.. ఒక రోజు క్లాసులో టీచర్ స్టూడెంట్స్ అందరికీ హోంవర్క్ చేయలేదని పనిష్మెంట్ ఇచ్చింది.ఒక్క అమ్మాయికి మాత్రం ఇవ్వలేదు.ఆ అమ్మాయి కూడా హోంవర్క్ చేయలేదు.ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు వదిలేశారని ఓ స్టూడెంట్ టీచర్‌ని ధైర్యం చేసి అడిగేశాడు.అప్పుడా టీచర్’’ఆ అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది. హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు.నేర్చుకునే శక్తి ఉంది. అందుకే’’అని ఘాటుగానే బదులిచ్చింది.ఆ అమ్మాయే చందనా దీప్తి.ఆ టీచర్ చెప్పిన సమాధానం గర్వంతో పొంగిపోయేలా చేస్తే.. చదివితే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుందనే ఆలోచన మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.బాగా చదువుకోవడానికి ఆ ఘటన స్ఫూర్తినిచ్చింది.
ఐఐటీ కోచింగ్‌కు వెళితే..
ఇక ఇంటర్‌లో ఉండగానే ఐఐటీ కోచింగ్ కోసం ఓ కోచింగ్ సెంటర్‌కు వెళ్లింది.అప్పటికే ఐఐటి రామయ్య సెంటర్‌లో సీటు కోసం ప్రయత్నించినా రాలేదు.అందుకని నెల్లూరులోనే ఓ కోచింగ్ సెంటర్‌కు వెళ్లారు.. అక్కడ లెక్చరర్ మాత్రం ఆడవాళ్లకు ఐఐటీ సీటు రాదు..అది మగవాళ్లకే.. నువ్వు ప్రయత్నించడమే వేస్ట్ అని తిప్పి పంపేశాడు.దీంతో చందనా దీప్తికి ఏడుపొచ్చింది.ఉక్రోషం వచ్చింది.ఆ తర్వాత కోపం వచ్చింది.తాను ఎలాగైనా ఐఐటీ సీటు సంపాదించాలనే పట్టు పట్టింది.ఆ మాట అన్నవాడి కోసమైనా సీటు కొట్టాలనుకుంది. కొట్టింది.
ఐఐటీ కంప్యూటర్ సైన్స్ చదివాక.. సివిల్స్ ప్రిపేరవుతున్న సమయంలోనే వరంగల్‌లో ఇద్దరు ఆడపిల్లలపై యాసిడ్ దాడి జరిగింది.ఆ ఘటన అప్పుడు సెన్సేషనల్.చందనా దీప్తిని తీవ్రంగా కదిలించింది ఆ ఘటన.ఆడపిల్లలకు రక్షణ లేదా.. ఎవడుబడితే వాడు తెగబడి దాడి చేస్తాడా అని మదనపడింది.ఆ తర్వాత పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి నిందితులను హతమార్చాక.. మనశ్శాంతి కలిగింది. అప్పుడే అనుకుంది తాను పోలీసు అధికారి అవ్వాలి.. అలాంటి వాళ్ల భరతం పట్టాలి అని.

కష్టపడితే ఈ అక్కలా పోలీసు ఆఫీసర్ అవుతారన్నకేసీఆర్
పోలీసు అధికారి అయ్యాక ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు..ఆడపిల్లలకు ఒక మాట చెప్పారు.చక్కగా చదువుకుంటే, కష్టపడితే..ఈ అక్కలా పోలీసు ఆఫీసర్ అవుతారు అని చందనా దీప్తిని చూపించారు. అది తన జీవితంలో మరువలేని ఘటన అని చందనా దీప్తి చెబుతారు.గర్వంగా ఉప్పొంగడమే కాక…తన విధుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి అవసరమైన స్ఫూర్తిని ఆ ఘటన అందించిందని చెబుతారు.
ఒకసారి రంగారెడ్డి జిల్లాలో పని చేస్తుండగా..ఓ యాక్సిడెంట్‌లో గాయపడ్డ వ్యక్తి చనిపోయాడని అనుకున్నారు. కాని ఘటనా స్ధలానికి చేరుకున్న చందనా దీప్తి ఆ వ్యక్తి ఊపిరి తీసుకుండటం గమనించి.. వెంటనే తన వెహికల్ లోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ వ్యక్తి బతికాడు. అలాంటి ఘటనలు ఎంతో తృప్తినిస్తాయని చెబుతుంటుంది చందనా దీప్తి.
కళాకారిణి కూడా..
రాజమండ్రిలో ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి.. ఆ తర్వాత చిత్తూరులోని గుడ్ షెపర్డ్ హైస్కూల్‌లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్‌ఈ),. నెల్లూరులో ఇంటర్, ఢిల్లీలో ఐఐటీ కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపరేషన్.. ఫస్ట్ అటెంప్ట్‌లో రాకపోయినా.. సెకండ్ అటెంప్ట్‌లో ర్యాంకు సంపాదించింది చందనా దీప్తి. ఎంత చదివినా, పోలీస్ అధికారి అయినా సరే.. తనలోనూ కళాకారిణి ఉంది. వీణ సైతం నేర్చుకుంది.ఐఐటీలో ఉండగా కల్చరల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా ఉండేదంట.
ఫ్రెండ్స్ అందరితోనూ టచ్‌లో..
ఎస్పీగా చేస్తున్నా సరే.. ఎంత బిజీగా ఉన్నా సరే..తను మాత్రం ఫ్రెండ్స్ అందరితోనూ టచ్‌లో ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా అందరితోనూ ఇంటరాక్షన్‌లోనే ఉంది.అందరూ కలిసి త్వరలోనే కలవాలనుకుంటున్నామని.. యూకేలో ప్లాన్ చేస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తమ్ముడు ధీరజ్ ప్రస్తుతం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడని.. తనకు మంచి సపోర్టివ్‌గా ఉంటాడని చెప్పింది.
Must Read ;- ఖాకీ డ్రెస్‌లో కోహినూర్ ఢైమండ్.. ఆమే దీపిక మండవ పాటిల్










