‘లెజెండ్’తో టాలీవుడ్‌కి మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిన జగపతిబాబు ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇప్పుడు ఇదే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. జగపతిబాబు బాలీవుడ్ లో కూడా విలన్‌గా నటించబోతున్నారనే ప్రచారం గతకొన్ని రోజులుగా జోరందుకుంది. అది కూడా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చిత్రంలో ఆయన నటించబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
‘అంతిమ్’ చిత్రం తర్వాత ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాను ప్రకటించిన సల్మాన్‌ఖాన్ ఆ చిత్రం షూటింగ్ మొదలెట్టేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే పలు కారణాలతో అనేకమార్లు వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు మే 11న సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని సల్మాన్ ఖాన్ ఓ వేదికపై చెప్పారు. ఇందులో వెంకటేశ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట.
ఇప్పటికే ‘రానా నాయుడు’ అనే ఓ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉన్న వెంకటేశ్ ఈ షెడ్యూల్‌లో సల్మాన్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తోపాటు సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో సల్మాన్ సరసన పూజాహెగ్డే కథానాయికగా అలరించబోతోంది.
ఇక ఈ మూవీలో జగపతిబాబు నాటిస్తున్నారు అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. బాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని అడిగిన ప్రశ్నకు ‘సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లతో నటించాలనుంది’ అని జగపతిబాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ఈ మూవీలో సల్లూభాయ్‌కి ఎదురుగా జగ్గూభాయ్ నటిస్తున్నారా అనేది నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తే జగ్గూభాయ్ కల నెరవేరినట్టే అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.