జగన్ సర్కార్ అత్యుత్సాహంపై న్యాయస్థానాలు నీళ్లు కుమ్మరిస్తున్నాయి. గత 24 గంటలలో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా 5 తీర్పులు రావడం గమనార్హం. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలను తీసుకువచ్చింది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆ జీవోల అమలును రద్దు చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఏపీ ప్రభుత్వ పీటీషన్ పై ఇవాళ విచారించిన సర్వోన్నత న్యాయస్థానం స్టేకి నిరాకరించింది. విద్యార్థుల తల్లి తండ్రులు కూడా ఆంగ్ల మీడియానికి మద్దతు తెలిపారని ఏపీ ప్రభుత్వ వాదనను పక్కన బెట్టిన సుప్రీం తల్లి తండ్రులు, మేధావులు అఫిడవిట్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది.
ఇదే సమయంలో హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని ఎస్ఆర్ కన్స్ట్రుక్షన్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం 217 కోట్ల భారీ జరిమానా విధించింది. అనేక అక్రమాలకు ఎస్ఆర్ కన్స్ట్రుక్షన్ పాల్పడిందని అధికారులు రిపోర్టులో తెలిపారు. ఈ జరిమానాను సవాలు చేస్తూ ఎస్ఆర్ కన్స్ట్రుక్షన్ కంపెనీ ఏపీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన కోర్ట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో ఎస్ఆర్ కన్స్ట్రుక్షన్స్ అధినేత గరికపాటి మోహనరావుకు ఊరట లభించింది. ఇలాగే ప్రభుత్వం విధించిన భారీ జరినామా నుంచి పోతుల రామారావుకు మినహానింపు ఇస్తూ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.
గొట్టిపాటి రవికుమార్ కు చెందిన లీజులను రద్దు చేస్తూ ఆరు రోజుల కిందట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఏపీ హైకోర్టు నిలుపుదల చేసింది. ఇదే సమయంలో స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణమంటూ రమేష్ హాస్పిటల్ అనుమతిని ఎందుకు రద్దు చేయకూడదంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కోర్ట్ గడప తొక్కింది. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నోటీసులను నిలుపుదల చేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. మద్యనిషేధం అమలు జరిగేలా అక్రమ మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాఖలైన పీటీషన్ ను విచారించిన హైకోర్టు మూడు మద్యం బాటిళ్లకు అనుమతి ఇస్తూ నిర్ణయాన్ని వెలువరించింది.
ప్రతికూల తీర్పుల పరంపర కొనసాగుతూ ఉండగానే ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ప్రభుత్వం తమ విధులలో మితిమీరిన జోక్యం చేసుకుంటోందని హైకోర్టులో పీటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రికరణ బిల్లులు కోర్ట్ పరిధిలోనే ఉన్నాయి. భూముల పంపణీ, దేవాదాయ నిధులను అమ్మఒడికి తరలింపు లాంటి అంశాలు హైకోర్టు విచారణలో ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయస్థానాలలో 320 ఫిర్యాదులు అందాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.











