(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం కోదండరాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను పరిశీలించేందుకు బుధవారం విజయనగరం వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటన బాధాకరమని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని శైలజానాథ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటువంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగాయని, అప్పటి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేవని అన్నారు. అప్పట్లో రాజకీయ పార్టీలు ప్రజలు సంయమనం పాటించేలా చర్యలు చేపట్టేవారన్నారు. ప్రస్తుతం పార్టీల తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ముఖ్యంగా కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీలు డ్రామాలాడుతున్నాయని, ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతూ, అసమర్థంగా వ్యవహరిస్తున్నారని, చేతగాని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు యంత్రాంగం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి , రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకోలేరా? అని ప్రశ్నించారు. నిందితులెవరో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.
మాన్సాస్ ఛైర్ పర్సన్‌ను మార్చినపుడు గుర్తు రాలేదా?
రాజుల ఆధ్వర్యంలో దేవాలయాలు ఉన్నాయని చెప్పే ముఖ్యమంత్రికి .. మాన్సాస్ ఛైర్ పర్సన్‌ను మార్చినపుడు గుర్తు రాలేదా? అని నిలదీశారు. ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకు చూపుతున్న శ్రద్ద .. చొరవ నిందితులను గుర్తించడంలో ఉండాల్సిందని హితవు పలికారు. ప్రజల మధ్య వర్గ, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం, రాజకీయం చేయాలనుకోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టకుండా నిందితులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే అటు వైసీపీ, ఇటు బీజేపీ ఇటువంటి డ్రామాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ – వైసీపీ ఒక గూటి పక్షులేనని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే బయటపెట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, శైలజానాథ్ రాకను తెలుసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది.
Must Read ;- ఎవ్వరినైనా సరే.. రామతీర్థం వెళ్లనివ్వరంతే!

రామతీర్థం బయల్దేరిన శైలజానాథ్ అరెస్టు
రామతీర్థం బయల్దేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థం నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు మతాలను అడ్డు పెట్టుకోవద్దని శైలజానాథ్ సూచించారు. రెవెన్యూ యంత్రాంగం విజయనగరంలో సెక్షన్ 30ను అమలు చేస్తోంది. అందువల్ల ఏ సంఘమైనా, రాజకీయ పార్టీ ప్రతినిధులైనా రామతీర్థంలో ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి. ఈ సెక్షన్ కేవలం రామతీర్థంలోనే కాకుండా విజయనగరం డివిజన్ పరిధి అంతటికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Also Read ;- సూరిబాబు.. రాములోరికి బలిపశువు ఎలా అయ్యాడంటే..











