(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, ఆంధ్రా భద్రాద్రిగా పేరు గాంచిన రామతీర్థంలో అపచారం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా రామతీర్థం బోడి కొండపై కోదండరాముల వారి ఆలయంలో శ్రీరాముని విగ్రహం శిరస్సును కొందరు వ్యక్తులు మంగళవారం ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ ఆస్కారం లేకుండా పోలీసులు పరిసర ప్రాంతాలు అంతటా మోహరించారు.
పనిగట్టుకుని దాడి చేశారు : శ్రీనివాసనంద స్వామి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని కోదండ రాముని విగ్రహంపై పనిగట్టుకొని దుండగులు దాడి చేశారని, దాడికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని రామతీర్థం పరిరక్షణ పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసనంద స్వామి డిమాండ్ చేశారు. ఈ దాడితో హిందువుల మనోభావాలు పైన కుట్ర జరుగుతోందని మరోమారు రుజువైందన్నారు. మొన్న విశాఖలోనూ విగ్రహాలపై దాడులు జరిగాయన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ సంఘటనలో ఇప్పటివరకూ ఎవరినీ పట్టుకోలేదని, ఇలాంటి చర్యలతో హిందువులు అందరూ బాధపడుతున్నారని ఆవేదన చెందారు. ఈ రాష్ట్రంలో రాములవారికే రక్షణ లేకపోతే, ఇంకెవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. దోషులను తక్షణమే పట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు.
దుండగుల పని ఇది : ఎస్పీ
సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే విజయనగరం ఎస్పీ బి. రాజకుమారి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాములోరి ఆలయాన్ని, విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది దుండగుల పనియని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోలీసు టీంను ఏర్పాటు చేసామని, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Must Read ;- ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?











