కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కంపా నిధుల వినియోగంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అడవుల వృద్ధికి కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేజేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ పేరుతో CAMPA నిధులను ఏటా మంజూరు చేస్తోంది. అయితే ఈ నిధులను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు బుధవారంహైకోర్టులో పిల్ వేశారు.
సురేష్ బాబు పిల్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అటవీ శాఖకు కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో వివరాలు సేకరించి కోర్టుకు 4 వారాల్లో సమర్పించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతివాదులు కౌంటర్ దాఖలుకు ధర్మాసనం 4 వారాల గడువు ఇచ్చింది. పిటీషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఏమిటీ కంపా?
అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు కంపా పథకం ద్వారా కేటాయిస్తోంది. ఈ నిధులను అటవీ శాఖ అడవుల విస్తీర్ణం పెంచేందుకు వినియోగించాలి. అయితే ఏపీలో కంపా నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కంపా నిధులతో మొక్కలు నాటడం, వాటికి సంరక్షణ కల్పించడం, ట్రెంచెస్ తవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ కంపా నిధులను అడవుల విస్తీర్ణం పెంచే పనులకు కాకుండా దారి మళ్లిస్తున్నారని సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో కంపా నిధుల వినియోగంపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Must Read ;- విశాఖ రాజధాని నిర్మాణాలకు హైకోర్టు బ్రేక్