వైసీపీ నుంచి విజయమ్మను సాగనంపేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారా ? విజయమ్మతో జగన్ కు వచ్చిన ఇబ్బందులు ఏమిటి ? గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటి ? విజయమ్మ విషయంలో వైఎస్ అభిమానులు ఏమనుకుంటున్నారు ?
వైసీపీ నుంచి వైఎస్ విజయమ్మను బయటకు పంపేందుకు ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన మాస్టర్ ప్లాన్ ని కూడా సిద్ధం చేసుకున్నారనే చర్చ జోరందుకుంది. విజయమ్మ గత కొంత కాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటుండడం, జగన్ సైతం ఆమెతో ఎడమొహం, పెడమొహంగా ఉంటుండడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇక వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ ఫ్లెక్సీలలో ఆమె ఫొటోలు కూడా కనిపించకపోవడం ఆమె పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే చర్చకు దారిసతీస్తోంది.
వాస్తవానికి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు వెన్నంటి ఉన్నవారు ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల. ఇక జగన్ అధికారంలోకి రావడంలో వీరు చాలా కీలక పాత్ర పోషించారు.జగన్ కు అండగా కష్టకాలంలో కూడా ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయడమే కాదు.. ఊరు వాడా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన కోసం ప్రచారం కూడా చేశారు. ఫలితంగా జగన్ అధికారాన్ని చేజిక్కించుకున్నాకా వారిని పక్కన పెట్టేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన చెల్లెలు షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టిపి పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు.ఇది జరిగిన కొంతకాలానికే వైఎస్ కుటుంబంలో నెలకొన్న కొన్ని వివాదాల కారణంగా విజయమ్మ, షర్మిల లకు జగన్ కు మధ్య దూరం ఏర్పడిందని టాక్.
ఈ కారణంగానే గౌరవాధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ విజయమ్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరిగింది.ఇక గత కొంతకాలంగా విజయమ్మ.. జగన్‌తో, వైసీపీతో ఎడమొహం, పెడమొహంగా ఉంటుండడంతో.. పార్టీ నేతలెవరూ కూడా ఆమెను పట్టించుకోవడం లేదట. చివరకు ఆమె పుట్టిన రోజున జగన్ సహా పార్టీ నేతలెవరూ ఆమెకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీంతో వైసీపీ ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మి వస్తారా రారా అనే చర్చ జోరందుకుంది. ఇదే సమయంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ప్లీనరీ ఫ్లెక్సీలలో ఆమె ఫొటోలు కనిపించకపోవడంతో ఆమె రాకపోవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే విజయమ్మను పార్టీ నుంచి తప్పించడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.ఆయన భార్య భారతీ రెడ్డికి పార్టీలో అడ్డంకులు లేకుండా చేయడమే దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. ఇప్పటికే షర్మిల పార్టీకి దూరం కావడంతో మిగిలిన తల్లిని కూడా వదిలించుకుంటే భారతీ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుందనే ఆలోచనకు వచ్చారని, అందులో భాగంగానే ఆమెను గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారని టాక్. అయితే నేరుగా ఆమెను తొలగిస్తే ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వచ్చే ప్రమాదముందని గుర్తించిన జగన్ రెడ్డి ఆమె స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాలని.. ఈ మేరకు రాజీనామా లేఖ ఎలా రాయాలో ఓ నమూనాను కూడా విజయమ్మకు పంపారట.
అదేసమయంలో భారతీ రెడ్డిని వైసీపీలోకి తేవాలనుకోవడం వెనుక జగన్ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జగన్ పై ఈడీ, సిబిఐ కేసులు కొనసాగుతుండగా అవి ఏ క్షణంలో అయినా ట్రయల్ కి రావచ్చునని..ఒకవేళ తాను జైలుకు వెళ్ళే పరిస్థితే వస్తే పార్టీ విచ్ఛిన్నం అయిపోతుందనే అనుమానం జగన్ లో నెలకొందట. అదే జరిగితే తాను నిర్మించుకున్న సామ్రాజ్యం, తన రాజకీయ భవిష్యత్తు రెండూ చిన్నాభిన్నం అయిపోతాయని. అలాంటివి జరగకుండా పార్టీని భార్య భారతీ రెడ్డి ద్వారా నడిపించాలని జగన్ చూస్తున్నారట. అందుకే విజయమ్మను పార్టీ నుంచి తప్పిస్తే భారతీ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుందని. ఇప్పటి నుంచే పార్టీ వ్యవహారాలలో ఆమెను యాక్టివ్ చేయవచ్చనే నిర్ణయానికి వచ్చిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు విజయమ్మను పార్టీ నుంచి తప్పించడం పైఅ వైఎస్ అభిమానులు గుర్రుగా ఉన్నారట. నిజానికి వైసీపీలో ఉన్న వారిలో అధిక శాతం మంది వైఎస్ఆర్ అభిమానులే. వైఎస్ అకాల మరణం తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన జగన్ కు వారంతా అండగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పటికే షర్మిల వైసీపీకి దూరం కావడంతో జగన్ ధోరణి పై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక తాజాగా విజయమ్మ కూడా పార్టీ నుంచి తప్పించబోతున్నారనే ప్రచార జరుగుతుండడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.తామంతా వైఎస్ అభిమానులమని, వైఎస్ సతీమనికే అవమానం జరిగితే పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెబుతున్నారట.
మొత్తానికి వైసీపీ ఆవిర్భావం నుంచి మూలస్థంబంలా కష్టకాలంలో కూడా జగన్ కు వెన్నంటి నడిచిన తల్లి విషయంలో జగన్ తీరు పై అనేక విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మూలస్థంబాన్ని జగనే కూల్చేస్తున్నాడాని, పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పించారని విశ్లేషకులు భావిస్తున్నారు.