పోసాని కృష్ణమురళి తాజాగా చేసిన కామెంట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అదే టైంలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఇక ఆయన ఇప్పుడు ఏ ఉద్దేశంతో కామెంట్లు చేశారనే విషయం పక్కన పెడితే.. గతంలో పలుమార్లు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తావనకు వస్తున్నాయి. గతంలో చిరంజీవికి, టీడీపీకి ఫాలోవర్ గా ఉన్న పోసాని..2018నుంచి పూర్తి స్తాయిలో టీడీపీ వ్యతిరేకిగా మారారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారన్న ప్రచారం జరగుతోంది. బహిరంగంగానే ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆయనతోపాటు రాజశేఖర్, జీవిత, ఆలీ తదితరులు వైసీపీలో చేరారు. అటు సొంత పార్టీవారిపై, ఇటు సినీ నటులపై, ఇతర పార్టీలపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు పోసాని ఓపెన్ గా మాట్లాడతారని, తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడతారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. నచ్చే వారికి ఓపెన్ హార్ట్ వ్యక్తిగా ఉండగా నచ్చనివారు ట్రోల్ చేస్తున్నారు. ఇక జోకర్, బ్రోకర్ అనే మాటలు డైరక్ట్ గా ఎవరూ అనకున్నా.. ఆ మధ్య రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా.. పోసానిని పరోక్షంగా ఉద్దేశించి జోకర్, బ్రోకర్ అనే కామెంట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇక పోసాని గత వ్యాఖ్యలు ఓ సారి పరిశీలిస్తే..
- గత ఏడాది జూన్ లో చంద్రబాబును డైరక్ట్ గా టార్గెట్ చేశారు. చంద్రబాబు వస్తే.. మళ్లీ వాళ్ల రాజ్యమే వస్తుందని సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.
- వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఓ ప్రెస్ మీట్ లో సొంత పార్టీపైనే తన అసహనాన్ని వెళ్లగక్కారు. వైసీపీ పెట్టినప్పుడు తాను, రోజా మాత్రమే ఉన్నామని ప్రెస్ మీట్ లో చెప్పారు. అప్పటికి 30 ఇయర్స్ ప్రుథ్వికి ఎస్వీబీసీ ఛైర్మన్ గా పదవి వచ్చింది. తరవాత ఈ కామెంట్లు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
- పవన్ కల్యాణ్ పైనా పోసాని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను సమర్థిస్తూ..పలు ప్రకటనలూ చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలని..పవన్ కల్యాణ్ ను విమర్శించారు.
- ఇక్కడే మరో విషయం కూడా ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోసాని చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. 14201ఓట్లు సాధించారు.
- ఇక సినీమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని తరువాత వ్యాఖ్యానించారు. గతంలో ఆయన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ను టార్గెట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
- ఆ మధ్య కాలంలో రేవంత్ అభిమానులు వర్సెస్ పోసాని వార్ జరిగింది. కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేసేటప్పపుడు ఆధారాలు ఉండాలని వ్యాఖ్యానించారు. వాస్తవంగా.. జీవో నెం 11కి విరుద్దంగా జరిగిన కేటీఆర్ దిగా చెబుతున్న ఫాంహౌస్ విషయంపై రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కి ఆశ్రయించారు. దీనిపై విచారణకు ఆదేశాలు వచ్చాయి. ఆ సందర్భంగా కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై పోసాని స్పందిస్తూ.. రేవంత్ కి సంబంధించి ఓటుకు నోటుకేసు విషయం మాట్లాడారు. డబ్బులతో దొరికిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ని ఎలా ప్రశ్నిస్తారనే విధంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ మంచి నాయకుడని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. రేవంత్ స్పందిస్తూ.. బ్రోకర్లు, జోకర్ లను కేటీఆర్ ప్రవేశపెట్టారని, వారి గురించి మాట్లాడేది లేదని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరుతో మాట్లాడిన పోసాని..తరువాత ఆయన దీనిపై స్పందించారు. ఈ విషయంలో తాను బాధపడ్డానని, తాను ఎప్పుడైనా సరే..రేవంత్ ని టార్గెట్ చేయలేదని ఖండన ప్రకటన చేశారు.
- పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విషయంలోనూ ఇద్దరు సీఎంలు కలసి పరిష్కరించుకుంటారని మరో సందర్భంలో వ్యాఖ్యానించిన పోసాని.. జగన్ గురించి మాట్లాడుతూ `జగన్..ఎన్టీఆర్ లా కాదు.. పొడవడానికి..పొడిపించుకోడానికి` అని వ్యాఖ్యానించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సందర్భంగా బాలకృష్ణ పైనా కామెంట్లు చేశాడు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బాలయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాలకృష్ణను ఉద్దేశించి..ఆయన నిజాయితీపరుడని చెబుతూనే.. బాలకృష్ణ కోప్పడినా కూడా సమాజానికి నష్టమేమి లేదని.. ఎవరికీ ఏం నష్టం ఉండదని వ్యాఖ్యానించాడు.
- ఇక ఆయన సినిమా ఇండస్ట్రీలో మాటల రచయితగా చాలా సినిమాలకు పనిచేశఆరు. పవన్ కల్యాణ్ నటించిన గోకులంలో సీత (తమిళంలో గోకులతైసీతైకి రీమేక్)కు మాటలు అందించారు. అప్పుడే ఓ ప్రెస్ మీట్ లో ఆయన పవన్ కల్యాణ్ ని తొలిసారిగా పవర్ స్టార్ అని చెప్పారు. అదే క్రమేణా పవన్ కల్యాణ్ అభిమానులు బిరుదుగా మార్చారని ఇండస్ట్రీ టాక్.
- మొన్న లాక్ డౌన్ టైంలో పోసాని 50 పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశాడు. అంతకుముందు తీవ్ర అనారోగ్యంతో చికిత్స చేయించుకుని బయటకు వచ్చాక.. తాను సినీపరిశ్రమలోని కార్మికులకు అండగా ఉంటానని వ్యాఖ్యానించాడు.
- గత ఏపీ ఎన్నికలకు ముందే మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఆ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలన్నారు. లేదా చంద్రబాబులా మోసం చేసే తెలివి ఉండాలని కూడా వ్యాఖ్యానించారు.
- 30 ఇయర్స్ పృథ్వీ రైతులకు సంబంధించి చేసిన కామెంట్ పై కూడా స్పందించారు. రైతులకు క్షమాపణ చెప్పాలని సూచించారు.
- ఇక ఆ మధ్య ఈటీవీ లో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాంనుంచి నాగబాబు బయటకు వచ్చాక.. జడ్జిగా పోసాని వచ్చారు. అయితే ఈ విషయంలో రోజా సూచన ఉందని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది.
- పోసాని పలుమార్లు మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ పోసానిని దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
- 2019 ఎన్నికలకు ముందే పోసాని ఓ సినిమా తీశారు.. ముఖ్యమంత్రిగారూ.. మీరు మాట ఇచ్చారు అనే పేరుతో సినిమా తీశారు. ఆ సినిమాలో చంద్రబాబుని టార్గెట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.
- ఇక ఇంకాస్త వెనక్కి వెళ్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాజావారి చేపల చెరువు పేరుతో ఓసినిమా వచ్చింది. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసి తీసినట్టుగా అప్పట్లో చర్చ నడిచింది. అదే టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఇది కూడా చర్చనీయాంశమైంది.