బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. బీహార్ అనగానే అక్కడ కులాల కుంపటి గుర్తుకు వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లోనూ కుల ఓట్లు చీల్చిన ఎల్జేపీ, మహాఘట్ బంధన్ కూటమిని అధికారానికి దూరం చేసింది. కేవలం వెయ్యి లోపు మెజారిటీతో ఆర్జేడీ 15 స్థానాలు కోల్పోయింది. అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీ సాధించిన ఎన్డీయే అభ్యర్థులు సాధించిన ఓట్లకు, మహాకూటమి అభ్యర్ధులు సాధించిన ఓట్లకు కేవలం 0.1 శాతం మాత్రమే తేడా ఉంది. అంటే కేవలం 12 వేల ఓట్ల తేడాతో మహాకూటమి అధికారానికి దూరమైంది.
ఎవరికెన్ని వచ్చాయి
బీహార్ విధానసభలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అధికారం కైవసం చేసుకోవాలంటే 122 సీట్లు సాధిస్తే సరిపోతుంది. తాజాగా ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారానికి అవసరమైన సీట్లకన్నా మూడు సీట్లు అదనంగా సాధించి బీహార్ లో వరుసగా నాలుగోసారి పాగా వేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిపి మమాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందని 90 శాతం సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే ఈ కూటమి 110 సీట్ల వద్దే ఆగిపోయింది. అంటే అధికారానికి అవసరమైన స్థానాలకన్నా కేవలం 12 సీట్లు మాత్రమే తక్కువ సాధించింది.
మహాకూటమిని దెబ్బకొట్టిన ఎల్జేపీ, ఎంఐఎం
బీహార్ ఎన్నికల్లో అధికారానికి అవసరమైన సీట్లు సాధించిన ఎన్టీయే కూటమి 37.3 శాతం ఓట్లు సాధించగా, మహాకూటమి కూడా 37.2 శాతం ఓట్లు సాధించింది. అంటే ఈ రెండు కూటముల మధ్య ఓట్ల తేడా శాతాల్లో చూస్తే 0.1 మాత్రమే. అంటే కేవలం 12 వేల ఓట్ల తేడాతో మహాకూటమి మరోసారి అధికారానికి దూరమైంది. ఒంటరిగా బరిలో దిగిన ఎల్జేపీ 5.7 శాతం, ఎంఐఎం 6.2 శాతం ఓట్లు సాధించాయి. అయితే ఎల్జేపీ అభ్యర్థి ఒక్కరే గెలవగలిగారు.
ఎంఐఎం నుంచి మాత్రం ఐదుగురు విజయబావుటా ఎగురవేశారు. ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్ లో మాత్రమే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులు స్పల్ప ఓట్ల తేడాతో 9 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఎల్జేపీ 5.7 శాతం కుల ఓట్లు చీల్చడంతో ఆర్జేడీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఆరుగురు ఓటమి పాలయ్యారు. వీరందరి మెజారిటీ కలిపి కేవలం 12వేలు మాత్రమే. అంటే 12 వేల ఓట్ల తేడాతో మహాకూటమి అధికారానికి దూరమైంది.
బీజేపీ వ్యూహంలో భాగమే…
మహాకూటమి చాలా పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగింది. అయితే ఎల్జేపీ మాత్రం ఏ కూటమితో జట్టుకట్టలేదు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీయేలో మొన్నటి వరకూ ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఆకస్మిక మరణంతో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలు భుజాలకు ఎత్తుకున్నారు. అయితే బీజేపీ చెప్పిన విధంగా బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీచేసింది. కుల ఓట్లు చీల్చింది. చివరకు తాను ఓడినా, ఎన్డీయే కూటమి విజయానికి మార్గం సుగమం చేసిందని రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు. ఇక ఎంఐఎం సిద్ధాంతాలు పరిశీలిస్తే ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేదు. అయితే మహాకూటమిలో చేరేందుకు కూడా ఎంఐఎం ఆసక్తి చూపలేదు. దీని వెనుక బీజేపీ అగ్రనేతల వ్యూహందాగి ఉండవచ్చని భావిస్తున్నా, రెండు భిన్నమైన సిద్దాంతాలు ఉన్న పార్టీలు సహకరించుకున్నాయంటే నమ్మలేం.
కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇచ్చారా
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలు కేటాయించి ఆర్జేడీ తప్పుచేసిందని ఆపార్టీ సీనియర్ నేత ఒకరు ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ గెలిచింది కేవలం 19 స్థానాల్లో మాత్రమే. ఇక తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ మంచి ఫలితాలే సాధించింది. గత ఎన్నికలకంటే మంచి ఫలితాలు వచ్చినా, అంచనాకన్నా 10 స్థానాలు తక్కువగా సాధించారు. 75 సీట్లు గెలిచిన ఆర్జేడీ బీహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీహార్ లో అభ్యర్థులు తన బలంకన్నా ఎదుటివాటి బలహీనతపై దెబ్బకొట్టి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పుకోవచ్చు.











