ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎవరిని దగ్గరికి చేరుస్తారో.. ఎవరిని దూరం చేస్తారో ఎవరికి తెలియదు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు అనేక మందితో ఆయన జత కలిసారు. ఆయన దూరం పెట్టడంతో పార్టీ వీడిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎవరు కలిసి వచ్చినా, ఎవరు కలిసి రాక పోయినా తెలంగాణ ఉద్యమాన్ని వంటి చెత్తో నడిపించారు కేసీఆర్. ఇతర పార్టీల నుండి నేతలు వచ్చినా స్వాగతించారు.. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిన వారిని ఆపలేదు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా పార్టీలో చేరికలు , బయటకు వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. ఇక అవసరం , అవకాశాన్ని బట్టి కేసీఆర్ ఏ వర్గాన్ని దగ్గరకు తీయాలో ఏ వర్గాన్ని దూరం పెట్టాలో తెలిసిన చాణుక్యుడు ఆయన… వివిధ వర్గాలకు పెద్ద పీఠ వేసి ఆశ్చర్యానికి గురిచేయడంలో ఆయన దిట్ట.
ఎన్నికల ముందు రైతులకు వరాలు..
ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ రైతులను తన వైపు తిప్పుకునేందుకు భారీ వ్యూహం వేశారు. అప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గ్రహించిన కేసీఆర్ అత్యధికం ఓటర్లుగా ఉన్న రైతులను అక్కున చేర్చుకునే పనిలో పడ్డారు. సుదీర్ఘ మంతనాల తరువాత రైతు బంధు . రైతు బీమా పథకాలతో రైతుల ఓట్లను గంపగుత్తగా సాధించిపెట్టుకున్నారు. కేసీఆర్ ఎత్తులతో విపక్షాలు పూర్తిగా డీలా పడిపోయాయి. కనీసం చెప్పుకోదగ్గ ఫలితాలు కూడా సాధించలేకపోయాయి. ఉద్యోగుల ఆదరణ చూరగొనేందుకు గతంలో పీఆర్సీని 44శాతం పెంచి ఉద్యోగులను తనవైపు తిప్పుకున్నారు. ఎప్పుడు ఎలా ఆలోచించాలి.. ఎవరిని దరిచేర్చుకోవాలి.. విపక్ష పార్టీలు తేరుకునే లోపే దెబ్బతీస్తారాయన.
తాజాగా వైశ్యులకు అందలం..
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణలో వైశ్యుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్న యోచనలో ఉండేది ఆ వర్గం. ఇంత మంది వైశ్యులు ఉన్నా కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చి తమను అవమాన పరుస్తున్నారన్న ఊహాగానాలు వినిపించేవి. నిజామాబాద్‌కు చెందిన బిగాల గణేష్ మాత్రమే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా తెలంగాణ అభివృద్ధికి కూడా వైశ్యులు ఎంతో కృషి చేస్తున్నారని ఈ వర్గం వారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజాగా ఆయన ఆలోచనలు వైశ్యులపై పడింది. ఏకంగా ఒకే రోజు మూడు ముఖ్యమైన పదవులను వారికి కట్టబెట్టారు. ఓ ఎమ్మెల్సీ స్థానం, టూరిజం కార్పోరేషన్ చైర్మన్‌తో పాటు టీఎస్ఐడీసీ చైర్మన్ పదవుల్లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించారు. దీంతో ఆ వర్గం ఓట్లు పూర్తిగా టీఆర్ఎస్ వైపు మొగ్గెలా చేసుకున్నారు. నేడో రేపో గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న వార్తల నేపథ్యంలో వైశ్య వర్గానికి చెందిన నేతలకు పదవులను కట్టబెట్టడం ద్వారా ఫండింగ్ రావడంతో పాటు ఓటర్లను ప్రభావితం చేసే శక్తి వారిలో ఉంటుందన్న నమ్మకంతో కేసీఆర్ వారికి పదవులు కట్టబెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.











