కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం దక్కిందనే చెప్పాలి. ఇటీవలే పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కీలక పదవులు దక్కగా… తాజాగా ఆయా రాష్ట్రాలకు పార్టీ ఇన్ చార్జీలను నియమించిన బీజేపీ అదిష్ఠానం.. అందులోనూ తెలుగు నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది.
మొన్నటి జాతీయ కార్యవర్గంలో కీలక పదవులు దక్కిన దగ్గుబాటి పురందేశ్వరి, డీకే అరుణలకు ఏకంగా ఇతర రాష్ట్రాల పార్టీ ఇన్ చార్జీలుగా నియమించిన బీజేపీ పెద్దలు.. తెలుగు నేలకు చెందిన మరో ముగ్గురు నేతలకూ కొన్ని రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఇలా వరుసపెట్టి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు కీలక పదవులు ఇవ్వడం వెనుక బీజేపీ అధిష్ఠానం భారీ వ్యూహమే ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కొత్తగా రాష్ట్రాల ఇన్చార్జీ బాధ్యతలు దఖలుపడిన వారిలో దగ్గుబాటి పురందేశ్వరి ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఈమెకు ఏకంగా రెండు రాష్ట్రాల ఇన్ చార్జీల బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ అదిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్ గఢ్ తో పాటు ఒడిశా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీగా పురందేశ్వరికి కొత్త బాధ్యతలు అప్పజెప్పింది.
సాధారణంగా ఒక రాష్ట్రానికి ఇన్‌చార్జీ అంటేనే ఓ రేంజి ప్రాధాన్యం దక్కినట్టు లెక్క. అయితే పురందేశ్వరికి ఏకంగా రెండు రాష్ట్రాల ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించడమంటే మరింత ప్రాధాన్యం ఇచ్చినట్టే భావించక తప్పదు. ఇక డీకే అరుణకు కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ చార్జీగా బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
పురందేశ్వరి, డీకే అరుణలతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేత మురళీధరరావుకు ఏకంగా మధ్యప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జీగా కీలక బాధ్యతలు దక్కాయి. ఇక ఉత్తరాదిలోనే కాకుండా యావత్తు దేశంలోనే రాజకీయంగా కీలక రాష్ట్రంగా పరిగణిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ చార్జీగా తెలుగు నేలకు చెందిన సత్యకుమార్‌ను బీజేపీ నియమించింది. అదే సమయంలో సీనియర్ రాజకీయవేత్త పొంగులేటి సుధాకర్ రెడ్డిని తమిళనాడు పార్టీ వ్యవహారాల కో-ఇన్ చార్జీగా నియమించింది. మొత్తంగా తెలుగు నేలకు చెందిన ఐదుగురు నేతలకు బీజేపీలో కీలక పదవులు దక్కడం ఆసక్తికరమేనని చెప్పాలి.
ఉత్తరాదిలో తనకంటూ ఎదురులేని పార్టీగా ఎదిగిన బీజేపీకి దక్షిణాదిలో మాత్రం ఎంతకూ పట్టు చిక్కడం లేదు. కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్నా… అక్కడ కూడా నిత్యం వైరి వర్గాలతో భీకర పోరు బీజేపీకి తప్పడం లేదు. ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఏమాత్రం పట్టు లేదనే చెప్పాలి. ఇటీవలి కాలంలో తెలంగాణలో పార్టీ క్రమంగా బలపడుతున్నట్లుగా కనిపిస్తున్నా.. జనంలోకి మరింతగా చొచ్చుకువెళ్లే విషయంలో అంతగా ఆశించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో తెలుగు నేలకు చెందిన నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా తెలుగు ప్రజల్లో మంచి ఇమేజీని సంపాదించుకోవడంతో పాటుగా వీలయినంత త్వరగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే దిశగానే బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.