2019లో హైద్రాబాద్ శంషాబాద్ వద్ద జరిగిన దిశ హత్యాచారం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. సరిగ్గా ఈ సంఘటన ను ఆధారంగా చేసుకొని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమా ప్రారంభించి.. ట్రైలర్ ను సైతం విడుదల చేసి అందరికీ షాకిచ్చాడు. దాంతో దిశ తండ్రి మీడియా ముందుకొచ్చాడు. ఈ సినిమాను విడుదల చేస్తే న్యాయపోరాటం చేస్తానని రామ్ గోపాల్ వర్మను హెచ్చరించాడు. మరో పక్క దిశ అత్యాచారం కేసులోని నిందితుల కుటుంబ సభ్యులు కూడా ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమా షూటింగ్ ను ఆపాలని కోర్డు మెట్లెక్కారు.
ఇటీవల మరోసారి దిశ నిందితుల కుటుంబ సభ్యులు, దిశ కుటుంబ సభ్యులు సుప్రీమ్ కోర్ట్ జుడీషియల్ కమీషన్ ను ఆశ్రయించారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని హైకోర్టు లోని జ్యుడీషియల్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని దిశతండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్ట్ ను కోరారు. ఎన్ కౌంటర్ కు గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు హైకోర్టుకు చేరుకున్నారు.
దిశ ఎన్ కౌంటర్ చిత్రం లో తమ వాళ్ళను విలన్స్ గా పెట్టి చేడు గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ చిత్రం తీయడం వలన కుటుంబ సభ్యుల జీవించే స్వేచ్ఛ కు భంగం కలుగుతోందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని, చనిపోయిన వారిని ఈ చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కమిషన్ కు తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన కమీషన్ కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. రామ్ గోపాల్ తీస్తున్న చిత్రాన్ని వెంటనే నిలిపి వెయ్యాలని కుటుంబ సభ్యులు కమీషన్ ను కోరారు.