సినీ నటి కరాటే కళ్యాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. కళ్యాణి అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటున్నారన్న ఫిర్యాదు కలకలం రేపింది. ఆర్టిస్ట్ కళ్యాణి పై వచ్చిన ఆరోపణలతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తనైఖీలు నిర్వహించి ఒక చిన్నారిని గుర్తించారు.యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన వివాదంలో చిక్కుకున్న ఆమె తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారింది.
కరాటే కళ్యాణి అక్రమంగా పిల్లలను కిడ్నాప్, కొనుగోలు వంటి నేరాలకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యక్తి చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు కల్యానియింట్లో సోదాలు చేపట్టారు. కాగా ఆ సమయంలో కరాటే కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లిని అధికారులు విచారించారు. కళ్యాణి పిల్లలను కిడ్నాప్ చేయడంతో పాటు, రెండు నెలల చిన్నారిని ఆమె అక్రమంగా కొనుగోలు చేసినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు అధికారులు ఆమె తల్లి విజయలక్ష్మికి తెలిపారు.
కరాటే కళ్యాణి ఇంట్లో అధికారులు నిర్వహించిన సోదాల్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలపై వారు ఆమె తల్లిని ఆరా తీశారు. దీంతో ఓ దంపతులకు పుట్టిన మూడవ ఆడబిడ్డను కళ్యాణి పెంచుకుంటోందని విజయలక్ష్మి అధికారులకు వివరించారు. తన కుమార్తె ఎటువంటి తప్పు చేయలేదని, తనకు పిల్లలు అంటే ఉన్న ఇష్టంతోనే ఆమె పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటోందని కళ్యాణి తల్లి విజయలక్ష్మి తెలిపారు. అదే సమయంలో కళ్యాణి పై కొందరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.
ఇదిలా ఉంటే కళ్యాణి ఇంట్లో ఉన్న చిన్నారి పై సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఆమె ఇంట్లో ఉన్న ఆ చిన్నారి ఎవరు ? ఆమె ఆ చిన్నారిని చట్టబడ్డంగానే దత్తత తీసుకున్నారా ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ ఎపిసోడ్ మొత్తంలో కరాటే కళ్యాణి ఎక్కడా కనిపించ లేదు. దీంతో కళ్యాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వాదన తెరపైకి వస్తోంది.
మొత్తంగా కరాటే కళ్యాణి వరుస వివాదాల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి, కళ్యాణికి మధ్య జరిగిన వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఇద్దరు ఎస్. ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వివాదం పూర్తిగా సర్దుమణగక ముందే కళ్యాణి చిన్నారిని అక్రమ దత్తత తీసుకున్నారంటూ మరో వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారింది.