‘ప్రేమ పక్షులం మనం.. ఎవరేమన్నా వినం’ అనే మాట బాలీవుడ్ జంట సిద్ధార్ద్ మల్హోత్రా, కియారా అద్వానీలకు అక్షరాలా వర్తిస్తుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో వసుమతి అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ. బాలీవుడ్ లో ఎం.ఎస్. ధోనీతో చిత్ర రంగ ప్రవేశం చేసిన ఈ భామ కియారా అద్వానీ తరచూ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ మల్హోత్రాతో చెట్టపట్టాలేసుకు తిరుగుతూ వార్తల్లోకెక్కుతోంది. ఇంచుమించు ఈ ఇద్దరూ ఒకే సమయంలో చిత్ర రంగ ప్రవేశం చేశారు.
2010లో ‘మై నేమ్ ఈజ్ ఖాన్ ’ సినిమాకి కరణ్ జొహార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సిద్ధార్థ్ మల్హోత్రా ఆ తర్వాత ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోగా మారిపోయారు. విక్రమ్ బాత్రా సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించే సందర్భంలోనే అతనితో కియారా ప్రేమలో పడినట్టు సమాచారం. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నా ఏదో ఒక సందర్భంలో కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఇప్పటిదాకా వీరిద్దరూ బహిరంగంగా తమ ప్రేమను వ్యక్తం చేయలేదు. ఇటీవల సిద్దార్థ మల్హోత్రా ఇంటి నుంచి బయటికి వచ్చిన కియారా అద్వానీ కారెక్కుతుండగా కూడా కెమెరాలు క్లిక్ మనిపించాయి.
ఇలా సిద్దార్థ్ ఇంటి నుంచి రావడం ఇది రెండోసారి. నల్ల దుస్తుల్లో తన కారు వైపు వెళుతూ కియారా కనిపించింది. ఆమె చేతిలో ట్రావెల్ కాఫీ కప్పు కూడా ఉంది. వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లినట్టు సమాచారం. అక్కడి నుంచి వీరు ఎలాంటి ఫోటోలనూ పోస్టు చేయనప్పటికీ విమానాశ్రయంలో కనిపించడంతో వదంతులకు తెరలేచింది. వీరు నటించిన ‘షెర్షా’ చిత్రం ఈ ఏడాది విడుదలకానుంది. మరి ఈ జంట తమ వ్యవహారంపై ఎప్పుడు గొంతు విప్పుతారో చూడాలి.