కరోనా కారణంగా కొంతకాలంగా నిర్మాణ దశలో వున్న సినిమాలు నిలిచిపోయాయి. నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల కాకుండా ఉండిపోయాయి. ఇక కొత్త సినిమాలు పట్టాలెక్కకుండా ఆగిపోయాయి. కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో, ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మళ్లీ సందడి మొదలవుతోంది. ‘దీపావళి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, తమ ప్రాజెక్టులకు సంబంధించిన పోస్టర్లను .. టీజర్లను .. ట్రైలర్లను వదులుతున్నారు. తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న ‘కిన్నెరసాని’ సినిమా నుంచి కూడా ఒక పోస్టర్ ను వదిలారు.

సముద్రం .. ఇనుప గొలుసులతో బంధించబడిన ‘కిన్నెరసాని’ అనే పుస్తకాన్ని ఈ పోస్టర్లో చూపించారు. ముందుకు దూసుకువచ్చే కెరటాలను .. మనసులో పొంగే ప్రేమ భావలను ఎవరూ ఆపలేరు అనే కాన్సెప్ట్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారనిపిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు. గతంలో నాగశౌర్య కథానాయకుడిగా ‘అశ్వద్ధామ’ సినిమాను తెరకెక్కించిన ‘రమణ తేజ’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.ఆర్.టి. మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘విజేత’ సినిమాతో లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కల్యాణ్ దేవ్, ఈ సినిమాతో నటన పరంగాను శభాష్ అనిపించుకుంటాడేమో చూడాలి.











