ఉమ్మడి క్రిష్ణాజిల్లాకు చెంది అత్యంత వివాదాస్పద నేతలుగా పేరు తెచ్చుకున్న వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. గుడివాడ, గన్నవరం మాజీ ఎమ్మెల్యేలు అయిన వీరిద్దరూ వారి ప్రభుత్వం అధికారంలో ఉండగా తోడు దొంగల తరహాలో కలిసిమెలసి ఉండేవారు. ఇప్పుడు ఇద్దరూ ఓడిపోయి, కేసుల భయంతో మొన్నటిదాకా గూట్లోనే నక్కి బయటకు రావడం మానేశారు. ఈ మధ్య కేసుల తాకిడి పెరగడంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పారిపోయారు. విదేశాలకు పోయి ఉంటారని భావిస్తున్నారు.
అదే దారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తన స్నేహితుడు వంశీ కేసుల బారి నుంచి తప్పించుకొనేందుకు పత్తా లేకుండా పారిపోగా.. ఇప్పుడు కొడాలి నాని కూడా అదే దారి ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కొడాలి నానికి కూడా వంశీ తరహాలోనే ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లో గుడివాడలో కేసినో నిర్వహించడం.. ప్రత్యర్థులపై తన అనుచరులతో దాడులు చేయించేవారు. అప్పట్లో అడిగేవారు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు అవే కేసులు కొడాలి నాని వెంటాడుతున్నారు.
కొడాలి నాని అరాచకాలను పోలీసులు వెలికితీయడమే కాక, వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు. ఇదే క్రమంలో వంగవీటి రంగా వర్ధంతిలో పాల్గొనకూడదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు. 2022 డిసెంబరు 25న టీడీపీ ఆఫీస్ లో ఉన్న రావి వెంకటేశ్వరరావును, ఇతరనేతలపై కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో కొడాలి నాని దాడి చేయించారు. ఈ ఘటనలో వైసీపీకి అందించిన అప్పటి పోలీసుల సహకారం మరువలేనిది.
అందుకే తాజాగా పోలీసులు అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు మెరుగుమాల కాళీ, మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. 149, 143, 144, 146, 188, 427, 506 భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కూడా వేసిన సంగతి తెలిసిందే. 2022 జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీపైనా వైసీపీ నేతలు దాడులకు పాల్లడ్డారు. అప్పటి కేసుల్ని వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే తనను కూడా అరెస్టు చేస్తారని కొడాలి నానికి భయం పట్టుకుంది. అందుకు సంబంధించి లీక్స్ కూడా అందడంతో కొడాలి నాని తన ఫ్రెండ్ వల్లభనేని తరహాలోనే పారిపోయినట్లుగా చెబుతున్నారు.