జగన్ మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీ పాగా వేసేందుకు రెడీ అవుతోంది. గతంలో జగన్ అధికారంలో ఉండగా వ్యవహరించిన తరహాలోనే ఇప్పుడు టీడీపీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పులివెందులలో జగన్ ను పెద్ద దెబ్బ కొట్టేలా ఇప్పటి నుంచి ప్రణాళిక రచిస్తోంది. నిజానికి జగన్ అధికారంలో ఉండగా కూడా కుప్పం స్థానిక సంస్థల విషయంలో అనేక రకాలుగా కుట్రలు చేసి మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెల్చుకోగలిగారు. కానీ, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుపై అది ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కుప్పంలో ఎమ్మెల్యేగా మరోసారి చంద్రబాబు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పులివెందుల టీడీపీ నాయకులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. తాజాగా స్కూల్ కమిటీ ఎన్నికల విషయానికి వస్తే పులివెందుల నియోజక వర్గంలో చాలా చోట్ల వైసీపీ మద్దతుదారాలు చేతులేత్తేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం.. తమను వదలబోదని, గతంలో తాము ఎన్నో అక్రమాలు చేసినందున.. ఇప్పుడు కేసుల్లో ఇరికిస్తారనే భయంతో వారు వణికిపోతున్నారు. దీంతోఅసలు పోటీకే ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో కూడా జగన్ పార్టీ మద్దతుదారాలు స్కూల్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకాడుతున్నారంటే.. పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం అవుతుంది.
ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ ఏకపక్షంగానే పులివెందులలో పాగా వేస్తుందని అంటున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్‌గా తూగొట్ల మధుసూదన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉండగా.. అలాగే వేంపల్లెను నగర పంచాయతీగా మార్చి, అక్కడి నుంచి చైర్మన్‌గా మునిరెడ్డిని చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అసలు వైసీపీ నాయకులతో నామినేషన్లు వేయించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు. గతంలో తాము చేసిన అక్రమాలతో కేసులకు భయపడి వైసీపీ నాయకులు కనిపించకుండా పోవడంతో జగనే తల పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేసి.. చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని స్థానిక తెలుగు దేశం నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అక్కడ మొత్తం పసుపు జెండాల హవానే కనిపిస్తోంది. ఇప్పుడు జగన్ అలర్ట్ అయ్యి పులివెందులపై ఎంత ప్రత్యేకంగా దృష్టి సారించినా కూడా పులివెందుల మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకునే పరిస్థితి లేదనే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి.