Revanth Takes TPCC Chief Charges :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) అధ్యక్షుడిగా మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకలో ఏళ్ల తరబడి ఈ పదవిలో కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించారు. వెరసి బుధవారం నుంచి టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టినట్టైంది.
వేడుకగా ప్రమాణ స్వీకారం
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గాంధీ భవన్ లో వేడుకగా జరిగింది. ఉదయమే తన ఇష్ట దైవం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి… భారీ అభిమాన సందోహం మధ్య ర్యాలీగా గాంధీ భవన్ చేరుకున్నారు. ఈ ర్యాలీ తొలుత కొద్ది మందితోనే ప్రారంభమైనా ఆ తర్వాత భారీ జనసందోహంతో కొనసాగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. పార్టీ ముఖ్య నేతలు సీతక్క, మల్ రెడ్డి రంగారెడ్డిలు ర్యాలీలో రేవంత్ తో కలిసి సాగారు.
అందరూ వచ్చినా.. ఆయన మాత్రం రాలే
ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన సీనియర్లు దాదాపుగా అందరూ తరలివచ్చారనే చెప్పాలి. రేవంత్ కు పదవి దక్కొద్దన్న కోణంలో తమవంతు యత్నాలు చేయడంతో పాటుగా పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి అలిగి కూర్చున్న మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్యలు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అయితే రేవంత్ ఢీ అంటే ఢీ అంటూఏ సాగిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. కోమటిరెడ్డి గైర్హాజరు ఈ సందర్భంగా ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ కు బాధ్యతలు అప్పగించగా… మాజీ మంత్రులు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, నాగం జనార్దన్ రెడ్డిలతో పాటు మల్లు రవి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!