కొండా దంపతులు… రాజకీయాల మీద అవగాహన ఉన్నవారికి ఏ మాత్రం పరిచయం అవసరం లేని జోడి వారిది. కొన్నాళ్లుగా రాజకీయంగా సైలెంట్ అయిపోయిన కోండా సురేఖ, మురళి దంపతులు మళ్లీ వరంగల్లో తమ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాల్లో తిరిగి తమ సత్తా చాటాలని కొండా దంపతులు భావిస్తున్నారట. దీనికి త్వరలో రానున్న వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నా ముందస్తు ప్రణాళికలతో ముందుకు పోయేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండా దంపతుల టార్గెట్ గా పనిచేస్తున్నారు. 2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే డివిజన్లలలో పట్టుబిగించి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం ఇతరపార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తన అనుయాయులను, కార్యకర్తలను కలుస్తున్న సురేఖ తీరుతో టిఆర్ఎస్ పార్టీలో చర్చ మొదలైంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే , మాజీ మేయర్ నరేందర్ పై గతంలో టీఆర్ ఎస్ లో ఉన్న సమయంలోనే నిప్పులు చెరిగిన కొండా దంపతులు ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో నరేందర్ కు షాక్ ఇవ్వాలని పావులు కదుపుతున్నారు.
పూర్తిగా అక్కడే ఫోకస్…
గతంలో పరకాల నుంచి పోటీ చేసినా ఈ సారీ మాత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కొండా సురేఖ అనుకుంటున్నారట. అందుకోసమే ఈ నియోజకవర్గంపైనే ఎక్కువ గా ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దానికనుగుణంగానే నియోజకవర్గం, డివిజన్ల వారిగా కార్యక్రమాలను వారు ఏర్పాటు చేసుకుంటన్నారు. నిత్యం కార్యకర్తలను, అనుచరులను కలుస్తూ తల్లో నాలుకలాగా ఉంటున్నారని పొలిటికల్ చర్చ జరుగుతోంది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా జిళ్లా టిఆర్ఎస్ నాయకులకు, కొండా దంపతుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరి బలాబలాలు ఏంటో తేల్చుకుందామనే కాడికి పొలిటికల్ వార్ నడుస్తుందంటాల సమయం ఉ ఆరు నెలలకు ముందే మాటల తూటాలు పేలుతున్నాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మున్సిపల్ డివిజన్లలో ఎవరి సత్తా ఏంటో చూసుకుందామని సవాళ్లు కూడా విసురుకుంటున్నారు.
ఫైర్ బ్రాండ్ గా పేరు….
కొండా సురేఖకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది.తను ఏ పార్టీలో ఉన్నా తన వాయిస్ ను గట్టిగా వినిపిస్తారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. అక్కడి నుంచి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ బాస్ కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై విమర్శలు చేసి ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఆ తరువాత టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులు చేరారు. వారు ఏ పార్టీలో ఉన్నా ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేసేవారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజక వర్గం నుండి పోటీ చేసి, టిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో 46,519 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సురేఖ, ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం పై దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బసవరాజు సారయ్య మీద కొండా సురేఖ విజయం సాధించారు. నాడు సురేఖ దంపతులపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం జరిగినప్పటికీ ఆమె వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించారు. జిల్లాలో తిరిగి తమ సత్తాను చాటేందుకు కొండా దంపతులు ఇప్పటి నుచే పావులు కదుపుతున్నారని తెలిసింది.











