టాలీవుడ్ లో సెన్సిబుల్ మూవీస్ తీయడంలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. సమాజిక సమస్యలు, సమాజ తీరుతెన్నులు ఆయన ప్రతీ సినిమాలోనూ ప్రతి బింబిస్తుంటాయి. ‘గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె’ సినిమాల్లో మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ అవే. అయితే ప్రస్తుతం క్రిష్ ఒక ప్రముఖ నవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. నన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవలను మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సినిమాగా మలుస్తున్నాడు. సరిగ్గా క్రిష్ ఎలాంటి కథనైతే కోరుకుంటాడో అలాంటి కథే ఈ నవల ఇతివృత్తం. ఒక అడవి చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో గొర్రెల కాపరుల జీవనవిధానాన్ని సినిమాగాతీస్తున్నారు క్రిష్. ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది.
ఇదిలా ఉంటే.. త్వరలో మరో నవలను కూడా క్రిష్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ రచయిత కె.కేశవరెడ్డి రచించిన ‘అతడు అడివిని జయించాడు’ నవల కథాంశం కూడా క్రిష్ ను బాగా ఆకట్టుకుందట. ఎప్పటి నుంచో క్రిష్ ఈ నవల ను సినిమాగా తీయాలని చూస్తున్నాడట. ఒక పందిపిల్ల తప్పిపోవడంతో ఒక ముసలివాడు దాన్ని వెతుక్కుంటూ అడివిలోకి వెళతాడు. ఇంతకీ అది ఆ ముసలివాడికి కనిపించిందా. అసలు ఆ అడివిలో ఏమై ఉంటుంది అనే ఉత్సుకతతో ఈ నవల అందరినీ బాగా చదివించింది. ముందుగా ‘కొండపొలం’ నవలా చిత్రం బాగా వస్తే.. ఈ సినిమాను కూడా మరింత ఉత్సాహంగా తెరకెక్కించనున్నాడు క్రిష్. ఇంకా పాత్రలు పాత్రధారులు ఎవరూ అనే విషయాలు తెలియదు. మరి క్రిష్ ఈ నవల్స్ తో ఏ రేంజ్ లో హిట్స్ అందుకుంటాడో చూడాలి.