ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడంలో తండ్రికి తగ్గ తనయుడని కెటిఆర్‌కు పేరుంది. ప్రతిపక్షాలను ఉద్ధేశించి తాజాగా కెటిఆర్ మీడియాలో స్పందించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉన్నారని, ప్రతిపక్షాలు మాత్రమే దివాలా తీశాయని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలో ఎజెండా దొరకని పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యనించారు. గురువారం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇంచార్జీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని ఆయన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు.
ప్రైవేట్ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అపూర్వమైన పాలన సంస్కరణలు చేపట్టామని, 60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని.. ప్రతిపక్షాలు మాత్రమే దివాలా తీశాయని ఎద్దేవా చేశారు.










