KTR Son Himanshu Tweet Gone Viral :
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ రాజకీయ వారసత్వం తన కుమారుడు, మంత్రి కేటీఆర్ వరకే కొనసాగుతుందా? ఆ తర్వాత ఈ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన మనవడు హిమాన్షు రావు సిద్ధంగా లేరా? అన్న విషయంపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం తన ట్విట్టర్ వేదికగా హిమాన్షు రావు పోస్ట్ చేసిన ట్వీట్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేసింది. రాజకీయాల్లోకి రాబోనంటూ హిమాన్షు చేసిన సదరు ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
కేసీఆర్ వారసుడిగా కేటీఆర్..
కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ రంగ ప్రవేశం కేసీఆర్ తోనే మొదలైంది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీ పేరిట రాజకీయ వేదికను ప్రకటించగానే.. అందులో చేరిపోయారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలోనే కొనసాగిన కేసీఆర్.. 2001లో టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 14 ఏళ్ల పాటు పోరాటం సాగించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యేలా చేశారు. ఆ తర్వాత తెలంగాణకు తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టి వరుసగా రెండో పర్యాయం కూడా ఆ పదవిని అందుకున్నారు. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ తర్వాత తెలంగాణకు సీఎంగా కూడా పదవి చేపట్టేందుకు కేటీఆర్ సంసిద్ధులు అవుతున్నట్లుగా చాలాకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
నా కలలు, లక్ష్యాలు వేరు..
ఇటీవలే అంతర్జాతీయ స్థాయి అవార్డు సంపాదించుకున్న కేటీఆర్ కుమారుడు అందరి దృష్టిని ఆకర్షించారు. తన తాత నియోజకవర్గం గజ్వేల్ లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన హిమాన్షు దానికి గానూ అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఇలాంటి తరుణంలో మంగళవారం ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన హిమాన్షు.. పలు అంశాలపై మాట్లాడారు. ఇందులో భాగంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి కూడా చాలా క్లారిటీతో మాట్లాడిన హిమాన్షు.. రాజకీయాల్లోకి తాను వచ్చే ప్రసక్తే లేదని, తనకు ప్రత్యేక లక్ష్యాలు, కలలు ఉన్నాయని, వాటిని సాధించడమే లక్ష్యంగా సాగుతానని ప్రకటించారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.