రాజకీయ వారసుల రంగ ప్రవేశం కోసం తెలంగాణలో జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఎవరైనా తమ వారసులకు పట్టాభిషేకం కోసం తాపత్రయ పడుతుంటారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా రాజకీయ వారసులు లేక పోతే ఏదో వెలితిగా ఉంటున్నట్టు ఫీలవుతున్నారు నేతలు.
దీంతో తమ పుత్రులను వీలైనంత త్వరగా రాజకీయాల్లోకి తీసుకు వచ్చి సెటిల్ చేయాలని చూస్తుంటారు. ఇక తమకు అదికార పార్టీలో , ప్రభుత్వంతో పదవులు ఉన్నప్పుడే ఈ పని చేసేస్తే పార్టీలో మిగతా నేతల కళ్లు ఇటువైపు పడవన్న అభిప్రాయం వారిలో ఉటుంది. తమ సొంత బంధువుల వారుసులను కూడా పెద్దగా ఎంటర్ టైన్ చేయరు ఈ విషయంలో .తన రక్త సంబంధం ఉన్న వారికే పెద్ద పీట వేయాలని చూస్తుంటారు.
తాజాగా తెలంగాణలో ఓ మంత్రి ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన అల్లుళ్లు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా ఆయనకు సంతృప్తి కలగడం లేదు. తన కుమారుడిని రంగ ప్రవేశం చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డే ఆ మంత్రి.
తెలుగు దేశం పార్టీ నుండి ఎంపీగా గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరిన మల్లారెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.
ఆ తరువాత ఆయన వారసుడిగా అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రంగ ప్రవేశం చేసారు. మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు. అయినా కేసీఆర్, కేటీఆర్ ల వద్ద మంచిపేరు సంపాదించుకున్నారు.
వచ్చే ఎంపీ ఎన్నికలకు గ్రౌండ్‌ప్రిపేర్ చేసుకోవాలంటూ ఆయనకు సూచించినట్టు సమాచారం. దీంతో రాజశేఖర్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ ప్రజల్లో ఉండిపోతున్నారు. దీంతో తన వారసుడికి ఎక్కడ స్థానం లేకుండా పోతుందో అన్న ఆందోళన మల్లారెడ్డిలో చెలరేగినట్టు చెబుతున్నారు ఆయన సహచరులు.
దీంతో తన వారసులను తెరపైకి తెచ్చేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారుట. ఇప్పటికే తన కుమారులు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే ఇద్దరు కుమారుల్లో పెద్దవాడిని రాజకీయాల పై దృష్టి సారించమని.. చిన్న వాడిని కాలేజీ వ్యవహారాలు చూసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇద్దరు సొంత వారసులు ఉన్న తరువాత అల్లుడికి అందలం ఇస్తే ఎలా అన్న ఆలోచనతో మల్లారెడ్డి రాజకీయ తంత్రాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి మరింతగా జనాల్లోకి వెళ్ళే ముందే తన కుమారుడికి తోడుగా ఉంటూ ప్రజల మధ్యలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉండటం, మత్రిగా కొనసాగుతుండటంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తన కుమారుడికి అవసరమైన మేర ప్రమోట్ చేస్తున్నారు మల్లారెడ్డి.
రాజకీయ వారుసుడిగా తమ అల్లుడు కాదు కుమారుడు వస్తాడన్న సంకేతం ఇప్పటికే మల్కాజ్ గిరి పరిధిలో ఇస్తున్న మల్లారెడ్డి తన కుమారుడిని రాజకీయ నేతగా సక్సెస్ చేయగలడా.. ఇప్పటికే ప్రజల్లో పార్టీలో తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజశేఖర్ రెడ్డిని ఓవర్ టేక్ చేసి మల్లారెడ్డి కుమారుడు రాజకీయాల్లో ఘనంగా రాణించగలడా అనేది చూడాలి.











