రాష్ట్రంలో ఇటీవల సీనియర్ మంత్రుల నుండి జూనియర్ల వరకు బహిరంగ సమావేశాల్లోను, మీడియా ముందును బండబూతులు మాట్లాడుతుండటం , అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చొద్దు
ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేవిధంగా ఏ ఒక్కరూ వ్యవహరించ వద్దని, దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే సహించనని మంత్రులతో ఆయన నేరుగా చెప్పినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి భారత ప్రధానిమంత్రి వ్యక్తిగత కుటుంబ విషయాలపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించడం , మరో సీనియర్ మంత్రి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై బహిరంగ సభలో బూతులు మాట్లాడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రేగింది. ఈ పరిస్థితులు వైసీపీని సంకట స్థితిలోకి నెట్టాయి.
ఈ అంశం విపక్షంతో పాటు స్వపక్షంలో కూడా తీవ్ర దుమారం రేపింది. అందువల్ల ముఖ్యమంత్రి నేరుగా కల్పించుకుని ఆయా మంత్రులతో మాట్లాడినట్లు తెలిసింది. భవిష్యత్తులో మంత్రులు హుందాగా వ్యవహరించాలని, బహిరంగ సభల్లో, మీడియా ముందు ఆచితూచి వ్యవహరించాలని క్లాస్ పీకినట్లు తెలిసింది.
శల్యపరీక్ష
మంత్రుల వ్యవహార తీరు, అభివృద్ధి పట్ల ఆకాంక్ష, నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రజలతో మమేకమవుతున్న తీరు, అధికారులు, మీడియా, సహచర ప్రజాప్రతినిధులతో కొనసాగిస్తున్న సత్ససంబంధాలు , అవినీతి, లాబీయింగ్ తదితర అంతర్గత వ్యవహారాలలో జోక్యంపై సీఎం నిశితదృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ శల్యపరీక్షలో నెగ్గిన మంత్రులకే ఆయా పదవుల్లో కొనసాగించేందుకు , లేదంటే ఉద్వాసన పలికేందుకు అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఒకరిద్దరి కి ఇప్పటికే హెచ్చరిక
శల్యపరీక్షలో తప్పుటడుగులు వేస్తున్నట్టు గుర్తించిన ఉత్తరాంధ్రకు చెందిన ఒకరిద్దరు మంత్రులకు ఇప్పటికే సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రిగావున్న భార్యామణి స్థానంలో భర్తే అంతా చక్కదిద్దుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించి, వారిరువురికి తన దగ్గరకు నేరుగా పిలిపించి రిపీట్ అయితే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది. అలానే మంత్రుల స్థానంలో వారి దగ్గర బంధువులు షాడోలుగా వ్యవహరిస్తూ దొరికినకడకి దోచుకునే తీరును గుర్తించి, సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది.
అమాత్యులు ఇకనైనా మారుతారా, ఇదంతా షరా మామూలే అనే చందంగా వ్యవహరిస్తారా అనేది వేచిచూడాలి.