సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్, కాంగ్రెస్ పార్టీ నయకురాలు విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆన్‌లైన్ ఆస్తుల పేరుతో ప్రజలను, రైతులను ప్రభుత్వం వేదిస్తుందని విజయశాంతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. శిక్షణ లేని సిబ్బంది, సాంకేతిక సమస్యల నడుమ ధరణీ పోర్టల్లో ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగుతోందని ఆమె ఆరోపించారు. పన్నులు కడితేనే ఆస్తులను ఆన్‌లైన్ చేస్తున్నారని, కట్టకుంటే నమోదుచేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ హక్కుల కోసం నిమ్స్ ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో ఎక్కడోచోట నిరసనలు చేపడుతునే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఇవి కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నారన్నారు. రైతులు, విద్యార్థులు, ప్రైవేట్ ఉపాధ్యాయుల ఇబ్బందులకు అంతేలేదన్నారు. రాష్ట్ర పాలనను పక్కనపెట్టి, కేవలం దుబ్బాక ఉప ఎన్నికపైనే కెసిఆర్ దృష్టిపెట్టారని ఆరోపించారు. ఈ అంశాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె తనదైన శైలిలో ఆరోపించారు.
ధరణీ, ఎల్ఆర్ఎస్‌పైనే దృష్టి..
రాష్ట్రంలో దుబ్బాక ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణీ, ఎల్ఆర్ఎస్ విధానాలు ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల్లో మంచి అస్త్రాలుగా మారుతున్నాయి. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుందనే భావన ప్రజల్లో ఉంది. అలాగే ధరణీ పోర్టల్లో ఆస్తుల వివరాలను నమోదు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ముప్పు వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రెండు పథకాలను ప్రతిపక్షం తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల ప్రచారంలో వీటిని తెగా వాడేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని, ప్రజలు తొందర పడి రూ.లక్షలకు లక్షలు ఫీజులు కట్టొద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఛీఫ్ ఉత్తమ్, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి కూడా ధరణీ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అలాగే దుబ్బాక ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రధానంగా ఎల్ఆర్‌స్, ధరణీ అంశాలను తీసుకొని ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రండు పథకాలపై ప్రజలకు ఉన్న ఆందోళన, అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు.. తమకు అనుకూలంగా మలుచుకొని ఓట్ల రూపంలో వాటిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ బరిలో ఉన్నకోదండరామ్ కూడా ఎల్ఆర్ఎస్, ధరణీ అంశాలను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
మరోపక్క అధికారపార్టీ నేతలు మాత్రం పారదర్శకమైన పాలనను అందించడానికే ఎల్ఆర్ఎస్, ధరణీ స్కీంలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.











