హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్య.. రాష్ట్రంలో కలకలం రేపింది. అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై గొడ్డళ్లతో నరికి మరీ చంపేశారు. ఈ హత్యలు.. హంతకుల పైశాచికత్వాన్ని కళ్లకు కట్టాయి. అలాగే.. ఎన్నెన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. ఇలాంటి హత్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఒకరిని హత్య చేయాలంటే.. ప్రత్యర్థులు పక్కాగా పథక రచన చేసుకుని, రెక్కీలు నిర్వహించుకుని ఎవరూ చూడకుండా, సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ చంపేవారు. కానీ, ఇప్పుడో.. చాలా సాధారణంగా, పట్టపగలు, అందరూ చూస్తుండగా, అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఇంటి కన్నా గుడి పదిలం అన్నట్లు.. హత్యలకు రహస్య ప్రదేశాల కన్నా.. నడిరోడ్డే రక్ష అని భావిస్తున్నారు. నేరగాళ్లలో కనిపిస్తున్న ఈ తెగింపునకు కారణమేంటి? చట్టం పట్టుకోలేదన్న ధీమానా? రాజకీయ అండతో తప్పించుకోవచ్చన్న నమ్మకమా? కోర్టుల్లో కేసును తిమ్మిని బమ్మిని చేసేయగల న్యాయవాద దిగ్గజాలు ఉన్నారన్న భరోసానా? వీటన్నింటినీ మించి మరో కారణమేదైనా ఉందా? అంటే.. కచ్చితంగా ఉందనే చెప్పొచ్చు.
Also Read ;- తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు
కనమరుగవుతున్న మానవత్వం..
ఓ 13 ఏళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో ఓ సన్నివేశం ఉంది. ఓ కుటుంబం.. అటవీ మార్గంలో కారులో వెళుతుండగా.. మర్గమధ్యంలో కారు అదుపు తప్పి బోల్తా పడుతుంది. అందులోని వారు తీవ్రంగా గాయపడి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు మీడియా వ్యక్తులు వారిని చూసి.. వారి పరిస్థితిని చిత్రీకరిస్తూ.. వారి గురించిన వివరాలు బాధితులనే అడుగుతుంటారు. అంటే.. ఆ పరిస్థితుల్లో ఉన్న బాధితులను ఇంటర్వ్యూ చేస్తుంటారు. దాదాపు 2 గంటల పాటు వారిని ప్రశ్నలతో వేధిస్తూ.. చానల్ కు లైవ్ రిపోర్ట్ చేస్తుంటారు. చివరికి వారి ప్రాణాలు పోయాక.. చల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. అదే.. వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించుంటే.. బాధితులను సరైన సమయానికి ఆస్పత్రికి తరలించి ఉంటే.. ఓ కుటుంబం బతికేది.
అది సినిమా కాబట్టి.. అందులో హీరో.. అలా బాధ్యత లేకుండా ప్రవర్తించిన వాళ్లను శిక్షిస్తాడు. మరి నిజజీవితంలో.. అలాంటి వారిని ఎవరు శిక్షిస్తారు? వాళ్లు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారే గానీ.. మనిషులుగా తమ ప్రవృత్తిని మర్చిపోయారు. వారు చేసిన పనికి సంస్థ యాజమాన్యం.. వారికి ఇంక్రిమెంట్లు, బోనస్ లు ఇచ్చి ఉండొచ్చుగానీ.. మనుషులుగా వారు అదఃపాతాళానికి పడిపోయారు. నాడు ఆ సినిమాలోని ఆ సన్నివేశాన్ని అనేక మంది విమర్శించారు. అలా ఎవరూ ప్రవర్తించరనీ, సినిమాలో మరీ అతిగా చూపించారనీ వాదించారు. కానీ, నేడు అదే నిజమవుతోంది. ఆ సినిమాలో చూపించిన సన్నివేశాన్ని బహుశా ఇప్పుడు ఎవరూ అతి అని అనరేమో!
Also Read ;- కలకలం రేపిన లాయర్ దంపతుల హత్య.. ఎన్నో అనుమానాలు, ఆరోపణలు
మానవత్వం మటుమాయం
వామనరావు దంపతుల హత్య విషయానికి వస్తే.. హత్యకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులోని సన్నివేశాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. ఈ మాట అన్నది హత్య గురించి కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న జన సమూహాన్ని ఉద్దేశించి. అక్కడ రెండు బస్సులు ఆగి ఉన్నాయి. వాటి నిండా జనం. వాహనాల రద్దీ. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా హత్యను అడ్డుకునేందుక యత్నించలేదు. పోనీ.. అనుకోని ఘటనతో షాక్ కు గురయ్యారా.. అంటే.. అది కూడా మహా అయితే.. ఓ నిమిషం ఉంటుంది. ఆ తర్వాతైనా స్పందిచాలిగా..! కానీ.. ఒక్కరూ స్పందించకపోగా.. అదేదో సాధారణమైన విషయమే అన్నట్లుగా అలా చూస్తూ వెళ్లిపోతున్నారు. కొందరైతే.. మరీ దారుణంగా సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరిస్తూ నిలబడ్డారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. హంతకులు తమ పని పూర్తి చేసుకుని పారిపోయాక (దర్జాగా వెళ్లిపోయాక).. అక్కడున్నవారు కొన ఊపిరితో ఉన్న వామనరావుని ప్రశ్నలతో వేధించారు. అది కూడా చాలా సరదాగా.. వీడియో తీస్తూ అతడి పేరు, వివరాలు సేకరించారు. దాదాపు గంట పాటు అక్కడే కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన వామనరావు.. చివరికి దయనీయమైన స్థితిలో, మానవ మృగారణ్యంలో ప్రాణం విడిచారు. హత్య జరిగేటప్పుడు.. అక్కడున్న వాళ్లలో ఓ పది మంది స్పందించి, అడ్డుకునేందుకు యత్నించి ఉన్నా.. పరిస్థితి మరోలా ఉండేది.
ఎవరిది నేరం? ఎవరిది ఘోరం?
ఈ ఘటనలో అందరూ దుండగులు కిరాతకంగా చంపేశారు అంటున్నారే గానీ.. అసలైన హంతకులు, నిజమైన కిరాతకులు అక్కడ చుట్టూ నిలబడి వినోదం చూస్తున్న జనం. ఏమీ ఎరుగనట్లుగా అలా చూస్తూ వెళ్లిపోతున్న ప్రజలు. వీడియోలు తీస్తూ.. హత్యను ‘ఎంజాయ్’ చేసిన కర్కశులు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలన్న కనీస పాటి మానవత్వాన్ని కూడా కోల్పోయిన మనుషులు. అసలు ఈ ఘటనలో.. హంతకుల కన్నా అక్కడ చేష్టలుడిగి చూస్తున్న జనులే సమజానికి అత్యంత ప్రమాదకారులు. కచ్చితంగా వీరిలో క్రూరత్వం పతాక స్థాయిలో ఉండి ఉంటుంది. లేకపోతే.. ఓ మనిషిని ఆ స్థితిలో అంతసేపు చూస్తూ నిలుచోలేరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారు హత్యలు చేసేందుకే కాదు.. ఎలాంటి నేరం చేయడానికైనా వెనుకాడరు. నిజానికి ఈ కేసులో హంతకులపై హత్యాయత్నం కేసు మాత్రమే నమోదు చేయాలి. అక్కడ నిలబడి చూస్తున్న, హత్యను వీడియో తీస్తున్న వారిపై హత్యకేసును నమోదు చేయాలి. అప్పుడే.. భవిష్యత్తులో జరగబోయే నేరాలను అదుపు చేయడం సాధ్యపడుతుంది. పోలీసులు గానీ, కోర్టులు గానీ ఈ దిశగా ఆలోచించి, అక్కడున్న వందలాది మంది హంతకులపై హత్య కేసు నమోదు చేసి.. కఠినంగా శిక్షిస్తే.. మరోసారి ఇలాంటి నేరం జరిగేటప్పుడు.. ఎవరూ చూస్తూ ఊరుకోరు. హంతకులు కూడా ఇంతగా తెగించరు. బలవంతంగా నైనా మానవత్వాన్ని బతికించుకున్న వాళ్లమవుతాం.
Must Read ;- న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన కోర్టు..