తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లాయర్ దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి సారధ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ హత్య కేసుకు సంబంధించిన నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానమైనది గ్రామంలోని గుడి వివాదం ఒక అంశం కాగా రెండోది స్థానికంగా కొందరు నాయకులపై అక్రమాలు చేస్తున్నారంటూ వామనరావు పలు ఆరోపణలతో కేసులు పెట్టడం, విచారణకు వచ్చేలా చేయడంతో ప్రత్యర్థుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గతంలో మంథని ఏరియాలో 2020మేలో జరిగిన శీలం రంగయ్య లాకప్ డెత్ వ్యవహారంలో వామనరావు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ ఘటనపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ కొందరు కూడా వామనరావుపై గుర్రుగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి.ఈ ప్రాంతంలో జరిగే అనుమానాస్పద ఘటనలపై వామనరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి అవి విచారణకు వచ్చేలా చేస్తుంటారు. ఆ విషయాలను పరిశీలిస్తే..
గ్రామంలో వివాదాలు
ఈ కేసులో టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ప్రధాన అనుచరుడిగా పేరున్న కుంటా శ్రీనివాస్‌తో పాటు కుమార్,చిరంజీవి, దాస్ తదితర వ్యక్తులపై కేసు నమోదైంది. వామనరావు స్వగ్రామమైన గుంజపడుగులో రామస్వామి గోపాలస్వామి రామాలయానికి ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గతంలో వామనరావు సంబంధీకుడు కమిటీ కార్యదర్శిగా ఉండగా ఓ రిటైర్డ్ అధికారిని పుట్టా మధు ప్రోత్సహిస్తున్నాడని వామనరావు భావించేవారు. క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలోనూ వివాదం తలెత్తింది. దీంతోపాటు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అనుమతుల్లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టడంపైనా వామనరావు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామంలో పేర్లు లేని ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాకుండా ఆలయ నిర్మాణం, ఆలయానికి అనుమతులు లేకుండా రంగులు వేయించే విషయంలోనూ పలు వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.
కుంట శ్రీనివాస్ ఎవరంటే..
కాగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా ఉన్న కుంట శ్రీనివాస్ పుట్ట మధుకర్‌కి ప్రధాన అనుచరుడిగా పేరుంది. లాయర్ దంపతుల హత్య కేసులో కుంట శ్రీనివాస్ A2గా ఉన్నాడు. గ్రామానికే చెందిన వెల్ది వసంతరావు A1ఉన్నారు. కుంట శ్రీనివాస్ కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్రామంలో కుంట శ్రీనివాస్‌తో వామనరావు కి పలు విభేదాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే గతంలో మావోయిస్టు అనుబంధ సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ సమాఖ్య (సికాస) సంస్థలో కుంట శ్రీనివాస్ పనిచేసినట్లు చెబుతున్నారు. 2005లో సికాస కోల్ బెల్డ్ కార్యదర్శి శ్రీధర్ ఎన్‌కౌంటర్ తరువాత శ్రీను బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం లేదు. గతంలో కుంట శ్రీనుపై పలు కేసులు ఉన్నాయి. గోదావరిఖని పోలీస్ స్టేషన్‌లో శ్రీనుపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. మంథనిలో భూ కబ్జా కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. స్వగ్రామంలో కుంట శ్రీను పోటీచేసి ఓడిపోయిన నేపథ్యంలో..ఆ ఓటమికి వామనరావు కారణమని కుంట శ్రీను భావించేవాడని తెలుస్తోంది. ఇక గతంలో కుంట శ్రీను (శ్రీనివాస్)కి సంబంధించిన ఓ ఆడియో కూడా కలకలం రేపింది. మంథనిలో ఓ నేతను టార్గెట్ చేసేందుకు రూ.50 లక్షలు, 2 సిమ్ కార్డులు ఉంటే పని అయిపోతుందని ఓ ముఖ్య నేతతో కుంట శ్రీనివాస్ మాట్లాడినట్లు ఆ ఆడియో టేపులో ఉంది. ఈ నేపథ్యంలో కుంట శ్రీనివాస్ ఈ హత్యల్లో ప్రధాన పాత్ర పోషించి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Must Read ;- తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు

డ్రైవర్ వ్యవహార శైలి..
కాగా మంథని నుంచి 16 కి.మీ. దూరంలో ఉన్న కల్వచర్ల వద్ద నిందితులు కారును ఆపి లాయర్ దంపతులను నరికారు. కారును ఆపడం, వెంటనే డ్రైవర్ సతీష్ కారు నుంచి దిగి పారిపోవడం అనుమానాలు తావిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వాహనం ముందుకి లేదా వెనక్కి నడిపి.. ప్రమాదం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తారు కదా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మంథనిలోనే ఉన్న ప్రధాన నిందితుడిగా ఉన్న కుంట శ్రీనివాస్‌కు అంత పక్కాగా వామనరావు హైదరాబాద్ నుంచి మంథనిలోని క్లయింట్ వద్దకు వెళ్లిన సమాచారం, తిరుగు ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఎలా చేరిందనే అంశంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే మరో వాదనా ఉంది. ఆకస్మికంగా అటాక్ చేసేటప్పటికి ఖంగారుపడిన డ్రైవర్ ప్రాణాలు కాపాడుకునేందుకు కారు దిగి పారిపోయాడని అభిప్రాయపడేవారూ ఉన్నారు.
శీలం రంగయ్య లాకప్ డెత్ కేసు..
మంథని మండలంలో లక్కేపూర్ శివారులో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను హతం చేస్తున్నారన్న ఆరోపణపై మైదుపల్లికి చెందిన ఉప్పు కుమార్, మక్కాల మల్లేష్, సిద్దపల్లికి చెందిన తాటి సంపత్, రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యలను మంథని పోలీసులు గత ఏడాది మే 22న పట్టుకున్నారు. ఈ కేసులో రంగయ్య A3గా ఉన్నాడు. అయితే మే 26న పోలీస్ స్టేషన్‌లోనే బాత్ రూంలో ఉన్న ఇనుప ఊచలకు తలపాగాతో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటనపై అప్పట్లోనే పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరపాలని, పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే రంగయ్య చనిపోయాడని ఆరోపిస్తూ న్యాయవాది గట్టు వెంకట నాగమణి, ఆమె భర్త గట్టు వామనరావులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో పాటు మానవహక్కుల కమిషన్‌ని కూడా ఆశ్రయించారు. కాగా ఈ వ్యవహారంలో తన భర్తను పోలీసులు టార్గెట్ చేసి వేధిస్తున్నారని, హైదరాబాద్‌లో ఉండే తన భర్తపై రామగుండం ప్రాంతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి పోలీసులు వేధిస్తున్నారని, మంచిర్యాలలో ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేశారని హైకోర్టును కూడా ఆశ్రయించారు నాగమణి. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు సీరియస్ అయింది. వామనరావు, నాగమణిల జోలికి వెళ్లవద్దని, తమ అనుమతి లేనిదే వారిని విచారించవద్దని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 8న చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను పొడిగించింది. ఇక లాకప్ డెత్ విషయానికి వస్తే.. ఆ కేసులో విచారణాధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను నియమిస్తూ హైకోర్టు ఆదేశించింది. రామగుండం సీపీ సత్యనారాయణ కాల్ డేటాను పరిశీలించాలని ఆదేశించింది. ఈ కేసులో వామనరావు పలుమార్లు రామగుండం సీపీ సత్యానారాయణతో వాగ్వాదానికి దిగినట్లు మీడియాలో కథనాలూ వచ్చాయి.
Also Read ;- న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన కోర్టు..
పుట్ట మధుపై ఫిర్యాదు..
కాగా వామనరావు మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ పై పలు ఆరోపణలు చేశారు. పుట్ట మధు ఇసుక అక్రమ రవాణా, అక్రమ క్వారీల ద్వారా రూ.900 కోట్లు సంపాదించాడని వామనరావు ఆరోపించారు. అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనం రేపాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పుట్ట మధు పలు అక్రమాలు చేశారని వామనరావు పలు మార్లు ఆరోపించారు. కాగా 2018 ఎన్నికల్లో పుట్ట మధు ఓడిపోయారు. ఈ ఓటమికి వామనరావు చేసిన ఆరోపణలు కూడా కారణమని అప్పట్లో చర్చ నడిచింది. అంతేకాదు.. గతంలో పుట్ట మధు పోటీ చేయకుండా ఉండేందుకు వామనరావు పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఇవే కాకుండా పలు అనుమానాస్పద కేసుల్లో పేదల తరఫున వామనరావు వాదిస్తున్నటు కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇక ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార టీఆర్ఎస్ పై ఈ హత్యలపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.











