(ది లియోన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం)
‘బెంజికారు మంత్రి’ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చటుక్కున గుర్తొచ్చే పేరు గుమ్మనూరు జయరాం. మంత్రుల్లో బోల్డంత మందికి బెంజికార్లు ఉండొచ్చు గానీ.. బెంజి పేరు వినగానే తన పేరు గుర్తొచ్చేలా చేసుకున్న.. హాట్ హాట్ గా వార్తల్లో ఉండే వ్యక్తి జయరాం. ఆయన అవినీతి కీర్తికథల్లో ఇప్పుడు మరో గొప్ప ఎపిసోడ్ చేరుతోంది.
ఇది ఏదో బెంజికారు లాంటి చిన్నా చితకా విషయం కానే కాదు. ఏకంగా 200 ఎకరాల భూకబ్జాలకు సంబంధించినది. మంత్రిగారు.. బెంగుళూరు కేంద్రంగా వ్యాపారం చేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ భూములను అక్రమ లావాదేవీల రూపేణా సుమారు 202 ఎకరాలు సొంతం చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయాలు జరిగినట్టుగా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో యాజమాన్య హక్కులు మారినట్లుగా రికార్డులు స్పష్టంగా ఉన్నాయి. అయితే.. ఇదంతా అక్రమ లావాదేవీ అని.. భూరికార్డులు తారుమారు చేసి.. గోల్ మాల్ చేశారని మంత్రి జయరాంపై కర్నాటకలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ మొత్తం భూకబ్జా బాగోతం ఏంటో చూద్దామా..
‘ఇట్టినా’ అనేది సుమారు ముప్ఫయ్యేళ్ల కిందట బెంగుళూరు ఏర్పాటు అయిన రియల్ ఎస్టేట్ గ్రూపు. రియల్ ఎస్టేట్ తో పాటు, హోటళ్ల నిర్వహణ, నిర్మాణ వ్యవహారాలు కూడా వీరు చూస్తుంటారు. ఈ గ్రూపులో సుమారు 9కి పైగా కంపెనీలు ఉన్నాయి. వీటిలో భాగంగానే ఇట్టినా ప్లాంటేషన్స్ అనే సంస్థ కూడా 1993 ఏప్రిల్ 1 వతేదీన ఏర్పాటు అయింది. మహాబలేశ్వరప్ప, మంజునాధ్ లు ఈ సంస్థలో డైరక్టర్లు. మహాబలేశ్వరప్ప మరణించిన తర్వాత ఆయన కుమారులు ఇట్టినా మోనా, ఇట్టినా మనూలు 2008 ఆగస్టు 1న ఇదే సంస్థలో డైరక్టర్లుగా చేరారు. 2009 మార్చి 31 నాటినుంచి మంజునాధ్ ఈ సంస్థ డైరక్టర్ హోదాకు రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. ఆ నాటితో ఈ కంపెనీ వ్యవహారాలతో అతనికి సంబంధం పూర్తిగా తెగిపోయింది.
అచ్చంగా ఇక్కడే మాననీయ మంత్రి వర్యులు రంగప్రవేశం చేశారు..
కొన్ని నెలల కిందట అంటే 2020 మార్చి రెండో తేదీన.. రెవెన్యూ శాఖ భూమి రికార్డుల హక్కు పత్రాల విషయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఇట్టినా కంపెనీకి చెందిన భూములను, కంపెనీకి పదేళ్ల కిందటే రాజీనామా చేసేసిన మంజునాధ్ పేరు మీదకు మార్పించి.. ఆయన పేరిట భూయాజమాన్య హక్కు పత్రాలను సృష్టించారు. మామూలు వ్యక్తులు తమ భూయాజమాన్య హక్కు పత్రాలను రెవెన్యూ ఆఫీసుల్లో తమ పేరిట మార్పించుకోవడానికి కొన్ని నెలలపాటూ వారి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ గౌరవనీయ మంత్రిగారు జోక్యం చేసుకోవడం వల్ల.. రోజుల వ్యవధిలోనే రికార్డుల మార్పిడి మంజునాధ్ పేరిట మార్చడం జరిగిందనే ఆరోపణలున్నాయి.
ఆ తర్వాత.. మంజునాధ్ నుంచి కొనుగోలు చేసినట్లుగా పత్రాలు తయారుచేయించి.. తన కుటుంబ సభ్యుల పేరుమీద, తన బినామీల పేరుమీద యాజమాన్య పత్రాలు మార్పించారు. తన కుటుంబసభ్యుల పేరిట ఈ భూమిపత్రాలను మార్పించుకోవడంలో కూడా మంత్రిగారు చట్టబద్ధమైన తెలివితేటలు చూపించారు.
మంత్రి భార్య రేణుక పేరుతో 30.83 ఎకరాలు, మంత్రి మొదటి తమ్ముడి భార్య ఉమాదేవి పేరుతో 30.53 ఎకరాలు, మంత్రి రెండో తమ్ముడి భార్య త్రివేణి పేరుతో 31.58 ఎకరాలు మొత్తం 92.94 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా పత్రాలు తయారయ్యాయి. వీటితో మరో 115 ఎకరాల విస్తీర్ణం గల భూములు అదే రోజున (2 మార్చి 2020) కొనుగోలు చేసినట్లుగా పత్రాలున్నాయి.
వారిలో కె.శ్రీదేవి పేరుతో 12.76 ఎకరాలు, కె.అనంత పద్మనాభరావు పేరుతో 48.07 ఎకరాలు, లింగప్ప శశికళ పేరుతో 46.48 ఎకరాలు, నర్సారెడ్డి పేరుతో 4.00 ఎకరాలు కొన్నారు. వీరందరూ మంత్రిగారి బినామీలే అనే ఆరోపణలున్నాయి.
ఈ విక్రయాలు పద్ధతి ప్రకారమే జరిగినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ భూములను విక్రయించడానికి ఇట్టినా ప్లాంటేషన్స్ బోర్డు తీర్మానించినట్లుగా ఒక లేఖ కూడా ఉంది. అది దొంగ తీర్మానం అనే ఆరోపణలున్నాయి.
అయితే మంత్రిగారు నకిలీ బోర్డు తీర్మానం పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గానీ, ఇందులో కూడా చిన్న పొరబాటు చేశారు. బోర్డు తీర్మానించిన ప్రకారం.. (అది నకిలీనా? నిజమేనా? అన్న సంగతి తరువాత) కేవలం 142 ఎకరాలు మాత్రమే విక్రయించాలి. అయితే మొత్తం 202 ఎకరాలు విక్రయం జరిగినట్లు రికార్డులు తయారయ్యాయి.
ఆ తరువాత.. మంత్రి జయరాం భార్య రేణుక, తమ్ముడు నారాయణస్వామి భార్య త్రివేణి, తమ్ముడు శ్రీనివాసులు భార్య ఉమాదేవి పేరిట భూములు మారినట్లుగా భూమి యాజమాన్య పత్రాలు రెవెన్యూ రికార్డుల్లో తయారయ్యాయి.
భూ క్రయవిక్రయాల లావాదేవీలు జరిగేప్పుడు.. రెండు లక్షల రూపాయలకు మించిన చెల్లింపులు ఏవీ కూడా నగదు రూపంలో జరగడానికి వీల్లేదనే నిబంధన ఉంది. అయితే మంత్రి భార్య రేణుక పేరిట కొనుగోలు చేసిన డాక్యుమెంటులో 52,42,000 రూపాయలు నగదు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ.. 1.63 కోట్ల రూపాయలు నగదుగా బదలాయించినట్లు చూపించారు.
కర్ణాటకలో పోలీసులకు ఫిర్యాదు
ఈ కొనుగోళ్ల లావాదేవీ పేరిట పత్రాలన్నీ 2 మార్చి 2020 తేదీతో తయారయ్యాయి. అయితే మేనెల నాటికి అసలు ఆ భూమలు యజమానులు మేలుకున్నారు. జరిగిన సంగతి గ్రహించారు. తమ కంపెనీకి చెందిన భూములను మంత్రి గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యుల పేరిట అన్యాక్రాంతం అయ్యాయంటూ కర్ణాటక రాష్ట్రం కోరమంగళలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో మంత్రి జయరాం భార్య రేణుక పేరును కూడా స్పష్టంగా ప్రస్తావించారు. ఏపీలో అధికార బలంతో.. తమను వేధిస్తున్నారంటూ.. కంపెనీ డైరక్టరు హోదాకు గతంలోనే రాజీనామా చేసిన మంజునాధ్ గురించి కూడా కంప్లయింటులో పేర్కొన్నారు.
ఈలోగా, కర్నూలు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు లో ఈ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోడానికి ప్రయత్నం జరిగినట్టుగా పోపిడి వచ్చింది. దాంతో ఇట్టినా కంపెనీ యాజమాన్యం.. ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పేర ఓ ఉత్తరం రాసింది. మంత్రి కుటుంబ సభ్యులు రుణం కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించాలని అందులో కోరారు.
వీరి వాదనకు బలం చేకూరుస్తూ.. మంత్రి కుటుంబసభ్యులకు రుణం మంజూరు చేయవద్దంటూ.. 2020 జూన్ 1వ తేదీన కోరమంగళ పోలీసు స్టేషన్ నుంచి బ్యాంకు సీఈవోకు అధికారికంగా లేఖ కూడా వచ్చింది.
మంత్రి ఆదాయ వివరాలు ఇంకో పెద్ద కామెడీ
ఈ భూకబ్జాల భాగోతం ఒక ఎత్తు అయితే.. మంత్రి జయరాం ఇన్ కమ్ ట్యాక్స్ శాఖకు దాఖలు చేసిన ఆదాయ వివరాలు గమనిస్తే ఇంకా కామెడీగా అనిపిస్తుంది. 2015-16లో తన ఆదాయం రూ.3,92,958 గాను, 2016617లో తన ఆదాయం రూ.4,22,500 గాను, 2017-18లో తన ఆదాయం రూ.1,44,000 గాను మంత్రి పేర్కొన్నారు.
2019 నాటి ఎన్నికల అఫిడవిట్ లో జయరాం పేర్కొన్న ప్రకారం.. రూ.47,88,755 విలువైన చరాస్తులు, రూ.35,00,000 విలువైన స్థిరాస్తులు, 8.50 ఎకరాల వ్యవసాయ భూమి, AP 21 BA 1188 నెంబరు గల టయోటా కారు ఉన్నాయని మాత్రం పేర్కొన్నారు.
మంత్రి గారు.. ఇప్పుడు ఏం చెప్తారు?
మంత్రి గుమ్మనూరు జయరాం- ఇట్టినా కంపెనీ భూములను వక్రమార్గంలో తన కుటుంబ సభ్యుల పేరు మీదికి మార్పించుకున్న ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు అన్నీ బయటకు వచ్చాయి.
మరి ఇప్పుడు మంత్రి జయరాం ఏం చెప్తారో.. ఈ భూకబ్జా బాగోతంపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.