(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
లైవ్ ఫిష్ ఒకవైపు.. తాజా రొయ్యలు మరోవైపు.. శుభ్రమైన కండిషన్లో ప్రాసెసింగ్ యూనిట్లు మరోవైపు… మొత్తంగా విశాఖ వాసులకు నాణ్యమైన మత్స్య సంపద అందుబాటులోకి వస్తోంది. నగర నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శనివారం ఆక్వా బజార్ ను అధికారికంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్న పనులు పూర్తయ్యాక తాజా చేపలు, రొయ్యలు మరో రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.
లైవ్ ఫిష్ కు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిష్ కియోస్క్, ఈ – కార్ట్ లను మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు ప్రారంభించారు. ఫిష్ కియోస్క్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల రుణం మంజూరు చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీ నిర్వాహకులకు దక్కనుంది. అదేవిధంగా 3,000 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్ లు, 225 కోట్ల వ్యయం తో అవసరమైన అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం, మొదటి విడతగా నాలుగు ఫిషింగ్ హార్బర్ లు, 25 ఆక్వా హబ్ లకు శంకుస్థాపన చేశారు.
ధరలపై పర్యవేక్షణ..
నగరంలో ఒకటి రెండు చోట్ల గతంలో లైఫ్ ఫిష్ కేంద్రాలు ఏర్పాటు అయినప్పటికీ ధరలు ఆకాశాన్ని తాకడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేసేవారు. ఆయా కేంద్రాల నిర్వాహకులు హార్బర్ నుంచి కొనుగోలు చేసుకొని, దానిపై రవాణా చార్జీలు, షాప్ రెంట్ లు ఇతర లాభాలు కలుపుకొని విక్రయించే సరికి సాధారణ మార్కెట్ కన్నా 30, 40 శాతం అధికంగా విక్రయిస్తే గాని గిట్టుబాటయ్యేది కాదు.
దీంతో లైవ్ ఫిష్ కొనాలంటే విశాఖ వాసుల పర్సు ఖాళీ అయ్యేది. ప్రస్తుతం ఏర్పాటయిన ఆక్వా బజార్ ను మత్స్యకారులే నిర్వహించడం, పైగా ధరల నియంత్రణపై మత్స్యశాఖ పర్యవేక్షణ ఉండడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకే లభించే అవకాశం కనిపిస్తోంది. సముద్ర తీరాన ఉన్నామన్న మాటే గాని.. మంచి సీ ఫుడ్ కొనుగోలు చేసేందుకు తగిన కేంద్రం లేని లోటు ఈ ఆక్వా బజారుతో తీరుతుందేమో చూడాలి మరి!











