కోవిడ్ తీవ్రత నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వల్ల తలెత్తే సమస్యలు,రద్దు చేయాల్సిన ఆవశ్యకతపై దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నిపుణులు,విద్యావేత్తలు,అధికారులతో సమీక్షించే సమయం దొరికింది.కానీ తాడేపల్లి శకుని మామ జగన్‌రెడ్డికి మాత్రం సమయం దొరకడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.ప్రధాని సమీక్ష అనంతరం దేశమంతా సీబీఎస్ఈ సీఐఎస్సీఈ పరీక్షలు రద్దు చేసినా,ఏపీ సర్కారు ఇంకా పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకుండా మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల ప్రాణాల రక్షణకు పరీక్షల రద్దు డిమాండ్‌తో వివిధ మార్గాలలో పోరాడుతోన్న నారా లోకేష్ బుధవారం జూమ్‌లో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
వాయిదాలో ఆంతర్యమేమిటి..
దేశమంతా పరీక్షలు రద్దు చేస్తే,మన రాష్ట్రంలో పది,ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం రద్దు చెయ్యకుండా వాయిదా వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.విద్యార్థుల పరీక్షలపై సమీక్షకు సమయంలేని సీఎం తన సొంత బ్రాండ్స్ మద్యం అమ్మి రూ.18 వేల కోట్లు ఎలా జనాల నుండి పిండాలో,ఇసుక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి కోట్లు ఎలా దోచెయ్యాలనే ప్రణాళికలు సిద్ధం చేసే బిజీలో ఉన్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కరోనా ఫస్ట్,సెకండ్ వేవ్ కలిపి 17 లక్షల కేసులు,11,034 మంది చనిపోయారని,వీరిలో 556 మంది ఉపాధ్యాయులున్నారని,ఒక్క సెకండ్ వేవ్ లోనే 400 మంది ఉపాధ్యాయులు చనిపోయారని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయన్నారు. సెకండ్ వేవ్‌లో కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో బెడ్లు దొరక్క,ఆక్సిజన్,మందులు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు మన రాష్ట్రంలో 14 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని,18-45 ఏళ్ల వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పట్లో వేసే అవకాశం లేదని పేర్కొన్నారు.ఆగస్ట్, సెప్టెంబర్‌లో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని,ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరించిన విషయాలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా పరీక్షలు అదే సమయంలో నిర్వహిస్తామనడం మూర్ఖత్వమేనన్నారు.పరీక్షలు నిర్వహించి తీరుతామంటోన్న శకుని మామ జగన్‌రెడ్డి గానీ, ఆయన మంత్రులు గానీ పిల్లల ప్రాణాలకు హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.పరీక్షలు రద్దు చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశానని,ఆఖరికి కేంద్ర హోంమంత్రికి కూడా లేఖ రాసి పరీక్షల వాయిదా వేసే అంశంపై జోక్యం చేసుకోవాలని కోరినా స్పందన లేకపోవడంతో కోర్టుకి వెళ్లడంతో,తప్పనిసరై పరీక్షలు వాయిదా వేశారని పేర్కొన్నారు.
పరీక్షలు రద్దు చేసేవరకూ పోరాడతా..
మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారని,ఇదే జరిగితే కోర్టు ద్వారా విద్యార్థుల ప్రాణాల రక్షణకు పరీక్షలు రద్దు చేసేవరకూ పోరాడతానని హామీ ఇచ్చారు.ముందుచూపు లేని జగన్‌రెడ్డి నిర్ణయాలతో ఇప్పటికే విద్యావ్యవస్థ గందరగోళంలో పడిందని,మతిలేని మూర్ఖపు నిర్ణయాలతో పరీక్షల పేరుతో విద్యార్థుల్ని మానసికంగా వేధిస్తున్నారని, చివరికి విద్యాసంవత్సరం కూడా అస్తవ్యస్తం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీబీఎస్ఈ,ఇతర రాష్ట్రాల పరీక్షలు కూడా రద్దు చేసిన విషయాలను ఓసారి పరిశీలించి,ఇప్పటికైనా జగన్‌రెడ్డి విజ్ఞతతో ఆలోచించి పరీక్షల రద్దుకి నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ కోరారు.