చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ తో వైసిపి విలవిల..
ఐప్యాక్ బ్యాచ్ సలహాలతో, సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన ‘‘మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్ నువ్వే జగన్’’ స్టిక్కర్ స్కీమ్ అట్టర్ ప్లాప్ అయ్యింది..లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ ట్రాప్ లో జగన్ పడ్డాడు, చంద్రబాబు సెల్పీ ఛాలెంజ్ మరింత చిక్కుల్లోకి నెట్టింది. వాటినుంచి బైటపడేందుకు జగన్ చేసిన స్టిక్కర్ ఛాలెంజ్ మిస్ ఫైర్ అయ్యింది..
జగన్ సైన్యం 175నియోజకవర్గాల్లో ఏప్రిల్ 7నుంచి 20వరకు 14రోజుల పాటు గడపగడపకూ వెళ్లి ఇంటింటిపై ఈ స్టిక్కర్లు అంటించాలని, కోటి 60లక్షల ఇళ్లను టచ్ చేయాలని సజ్జల నోట జగనోపదేశం తొలిరోజే బూమ్ రాంగ్ అయ్యింది. వైసిపి వాళ్లు అంటించిన స్టిక్కర్ ను కుక్క పీకేయడం వీడియో వైరల్ కావడం, సదరు కుక్కపై స్టేషన్ లో కంప్లయింట్ చేయడం ఈ మొత్తం ప్రోగ్రామ్ నే అభాసు పాల్జేసింది. కొన్ని ఇళ్లపై దిష్టిబొమ్మల పక్కన ఈ స్టిక్కర్లు అంటించడం కూడా నవ్వులపాలైంది..
దీనికి ముందు చేపట్టిన ‘‘గడపగడపకూ వైసిపి ప్రభుత్వం’’ కార్యక్రమం బెడిసి కొట్టింది ..175మంది ఇన్ ఛార్జులతో సమీక్షలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు గడపగడపకూ పాల్గొనక పోవడంపై సాక్షాత్తూ సీఎం జగన్ సీరియస్ కావడం సదరు నేతలకు మింగలేని కక్కలేని స్థితి..గడప గడపకూ వెళ్తే గుంతలు పూడ్చలేదని, ఫీజులు రాలేదని, పింఛన్లు ఎందుకు తీసేశారని, ఇల్లు పూర్తి కాలేదని, స్థలం రాలేదని జనం నిలదీతలు..వెళ్లకపోతే జగన్ అక్షింతలతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అటు పార్టీలోనూ ఇటు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. 3ప్రాంతాల్లోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిని టిడిపి క్లీన్ స్వీప్ చేయడం, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీని టిడిపి అభ్యర్ధిని ఘనవిజయం సాధించడం మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయ్యింది..4గురి ఓటమి, 4గురి క్రాస్ ఓటింగ్ వైసిపికి ఆశనిపాతం అయ్యాయి..
దీంతో దిక్కుతోచని స్థితిలో జగన్ రెడ్డి పార్టీకి కాయకల్ప చికిత్సకు నడుం కట్టాడు. హుటాహుటిన 175మందితో భేటీ అయ్యాడు, గత సమీక్షలా కోప్పడటాలు, మందలించడాలకు బ్రేక్ వేసి బుజ్జగింపులకు, బతిమిలాటలకు దిగాడు..తానెవరినీ వదులుకోనని, ఊరికే ఎవరినైనా ఎందుకు తీస్తానని, ఒకవేళ తీసినా ఎమ్మెల్సీ, కార్పోరేషన్ ఛైర్మన్ ఇస్తాననే మెసేజ్ పంపే యత్నం కూడా ఫలప్రదం కాలేదు..అనుమానాలసలే రాకూడదు, వస్తే ఒకిందానా పోవనేది వైసిపి ప్రస్తుత స్థితిగతుల్ని చూస్తే తెల్సిపోతుంది.
ఈ అనుమానాల మధ్య ఆరంభమైన జగన్ స్టిక్కర్ల స్కీమ్ ఆసాంతం అవమానాలే..తనకు ‘‘విద్యా దీవెన’’ రాలేదన్న విద్యార్ధితో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మండిపడటం చూశాం.. ‘‘ఎవరితో మాట్లాడుతున్నావ్…పథకం మంజూరు కాలేదన్నావంటే పళ్లు పీకేస్తా..’’నంటూ ఎమ్మెల్యే కోప్పడటాన్ని అక్కడి స్థానికులే కాదు, యావత్తు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేని స్థితి.. అలాగే సొంత పార్టీ కార్యకర్తపైనే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అవ్వడమూ చూశాం..‘‘యూజ్ లెస్ ఫెలో..నీ గడప వద్దకు వచ్చానని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా..’’ అంటూ ఉపముఖ్యమంత్రే మండిపడటం, ఉత్తరాంధ్రలో మంత్రులు బొత్స, ధర్మానను కూడా నిలదీయడం, సుబాబుల్ రేటు పడిపోవడంపై నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును రైతులు ప్రశ్నించడం, రాజధాని ఏదని అడిగితే నీకు తెలియదా అని సదరు ఎమ్మెల్యే అసహనం, తెలీదన్న వాళ్లతో తెలియకపోతే వదిలెయ్యమని పెడసరి జవాబులు వైసిపి నాయకులెంతగా ప్రజలకు దూరం అయ్యారో అద్దం పట్టాయి.. ‘‘వైకాపాకు ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. ఆత్మహత్యల పరిస్థితి కల్పిస్తున్నారని’’ విజయవాడ సమావేశంలో అధికార పార్టీ సర్పంచులే ధ్వజమెత్తడం రాష్ట్రంలో అధికారపార్టీపై ఏస్థాయిలో అసంతృప్తి పేరుకుపోయిందో బైటపెట్టింది..
ఇక వైసిపి స్టిక్కర్లకు పోటీగా తెలుగుదేశం పార్టీ, జనసేన విపక్షాలు కూడా స్టిక్కర్ల యుద్ధం ప్రారంభించాయి. ‘‘బాగు పడాలంటే బాబు రావాలి’’, ‘‘సైకో పోవాలి-సైకిల్ రావాలి’’ అంటూ టిడిపి స్టిక్కర్లు పోటాపోటీగా దర్శనమిస్తున్నాయి. ‘‘రాబోయేది జనసేన ప్రభుత్వం’’, ‘‘మాకు నమ్మకం లేదు జగన్- మా నమ్మకం పవన్’’ అంటూ ఇంటింటికీ స్టిక్కర్లతో జనసేన శ్రేణులు కూడా ముందుకెళ్తున్నాయి..
ఈ పరిస్థితుల్లో మార్కాపురం సభలో ‘‘సెల్ఫీ దిగే నైతికత చంద్రబాబుకు ఉందా..? ఇంటికి స్టిక్కరు వేసే ధైర్యముందా..’’ అని సీఎం జగన్ వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అయ్యాయి..వాళ్లు చేసిందాన్ని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు..సెల్ఫీ ఛాలెంజ్ చేయడానికి వాళ్ల దగ్గర చేసిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నాయి..దాన్ని నువ్వు స్వీకరిస్తే ప్రతిగా ఈ 4ఏళ్లలో నిర్మించింది చూపించి కౌంటర్ సెల్ఫీ ఛాలెంజ్ చేయాలి.. లేకపోతే చడీచప్పుడు చేయకుండా చేతులెత్తేయాలి.. అలా కాకుండా తగుదునమ్మా అంటూ, ‘‘ ఇంటికి స్టిక్కర్ వేసే దమ్ము చంద్రబాబుకు ఉందా’’ అనడం నవ్వుల పాలైంది..‘‘గత 4ఏళ్లలో ఇతనే ఇల్లు పూర్తిచేశాడని ఇంటింటికి వస్తాడు, గడపగడపకూ తిరగడానికి ఈయన కట్టిన ఇళ్లేమైనా ఉన్నాయా..? చంద్రబాబు కట్టిన ఇళ్లు కూడా పేదలకివ్వకుండా పాడుబెట్టాడు, టిడ్కో ఇళ్లన్నీ ముళ్లకంపలు పెరిగి అధ్వానం కావడానికి జగనే కారకుడని’’ లబ్దిదారులే మండిపడటం మరింత నవ్వులపాల్జేసింది..నలుగురూ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గనేది జగన్ రెడ్డికి ఆదినుంచి అలవాటే..
ఈ ‘‘స్టిక్కర్ ఛాలెంజ్’’ ద్వారా జగన్ రెడ్డి ఒకరకంగా లోకేశ్ ట్రాప్ లో పడ్డాడు..కియా కార్ల ఇండస్ట్రీ వద్ద లోకేశ్ చేసిన సెల్ఫీ ఛాలెంజ్, ఫాక్స్ కాన్ మహిళా ఉద్యోగుల బస్ ల వద్ద సెల్ఫీ, పెద్దిరెడ్డి మైనింగ్ లారీలను చూపిస్తూ సెల్ఫీ, ధర్మవరం నియోజకవర్గం ఎర్రగుట్టలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కబ్జా భూముల వద్ద సెల్ఫీలతో వైసిపి ఉక్కిరిబిక్కిరైంది. అటు టిడిపి చేసిన అభివృద్ధి పనులపై సెల్ఫీలు, ఇటు వైసిపి అవినీతి కుంభకోణాలపై సెల్ఫీలు జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి, వైసిపి నేతలను బెంబేలెత్తించాయి.
లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ స్ఫూర్తితో ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలంతా ప్రతి నియోజకవర్గంలో సెల్ఫీ ఛాలెంజ్ ల వరద వెల్లువై ఏకంగా వైసిపిని ముంచేసింది. సాక్షాత్తూ చంద్రబాబే రంగంలోకి దిగి నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేయడం బ్రహ్మాస్త్రమై జగన్ రెడ్డిని విలవిల్లాడేలా చేసింది..అటు తండ్రీకొడుకుల సెల్ఫీ ఛాలెంజ్ లు, ఇటు టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, 175 నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జుల సెల్ఫీ ఛాలెంజ్ ల ధాటికి తట్టుకోలేకే మార్కాపురంలో జగన్ రెడ్డి స్టిక్కర్ ఛాలెంజ్ చేశాడు. ఇంటింటా తానిచ్చిన సంక్షేమం ఏదో అక్కరకొస్తుందని ఆశిస్తే, అదికాస్తా బెడిసి కొట్టింది. ఇప్పటికే 25లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయనడం మరింత హాస్యాస్పదమైంది..
వాలంటీర్లతో పార్టీ పనులు చేయించ కూడదని ఇప్పటికే న్యాయస్థానాలు స్పష్టం చేసినా ఇప్పుడీ స్టిక్కర్లను కూడా వాలంటీర్లే అతికించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..వీళ్లకు వేతనాలు ప్రభుత్వం నుంచి ఇస్తుంటే, సేవలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నారంటూ విపక్షాల లేఖలు, పిటిషన్లు విదితమే..
వెళ్లిన చోటల్లా మన రాజధాని ఏదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని, గత టిడిపి ప్రభుత్వమిచ్చిన 30 స్కీములను రద్దు చేశారని, పింఛన్ తీసేశారని, ఫీజులు రాలేదని, ఇల్లు పూర్తికాలేదని, స్థలం ఇవ్వలేదనే నిలదీతలతో మంత్రులు, ఎమ్మెల్యేలలో అసహనం పెరిగింది. తత్ఫలితమే జనంపై బెదిరింపులకు దిగడం, మండిపడటం జరుగుతోంది.. తామంటించిన స్టిక్కర్ తీసేస్తే స్కీమ్ లలో పీకేస్తామనే సరికొత్త బెదిరింపులు, ప్రతి ఇంటికి వెళ్లి జనం నాడి పరిశీలన, నయానోభయానో వారిని దారికి తెచ్చే ప్రయత్నాలు, దారికి రాకపోతే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతవుతాయనే భయందోళనలు కూడా సర్వత్రా ఉన్నాయి.. అందుకే జనం కూడా బైటపడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
4ఏళ్లుగా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుండి బైటకు రాకుండా, కనీసం సెక్రటేరియట్ కూ వెళ్లకుండా, అడపాదడపా ఏదో మొక్కుబడి బటన్లు నొక్కుతూ, ఇప్పుడీ ఎన్నికల ఏడాదిలో జనం వద్దకెళ్లి తమ ముఖాన పేడనీళ్లు కొట్టించుకునే దుస్థితి కల్పించడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులే కాదు మొత్తం వైసిపి శ్రేణుల నమ్మకాన్నే దెబ్బకొట్టింది. 4ఏళ్ల హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు-అక్రమ నిర్బంధాలు, ఎస్సీ, ఎస్టీ, బీసి, ముస్లిం మైనార్టీలే కాకుండా అన్నివర్గాల ప్రజలపై జరిపిన దమనకాండ ఎక్కడికెళ్లినా వైసిపిని తరిమికొడ్తోంది..
తన చేతగాని పాలనతో పార్టీలోనే నమ్మకం కోల్పోయిన జగన్, పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్ధకం చేసిన జగన్ తమనిలా చంకలకు బ్యాగులతో గడపగడపకూ వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్ నువ్వే జగన్ స్టిక్కర్లు అంటించమనడం, ఆయా వర్గాలతో నిలదీయించుకునే దుస్థితి కల్పించడంపై వైసిపిలోనే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి..లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ తెచ్చిన తిప్పలివని కొందరు, జగన్ స్టిక్కర్ ఛాలెంజ్ స్వయంకృతమని మరికొందరు, అసలు తమ రాతే బాలేదని ఇంకొందరు నిర్వేదం చెందుతున్నారు..వైసిపికి తగిన గుణపాఠం ఎప్పుడెప్పుడు చెబుదామా అని జనం మాత్రం ఎదురెదురు చూస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!
కాకరేపుతున్న అక్రమ కేసులు..! తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్...