తనతోపాటు విదుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను ఓ డ్రైవర్ హత్య చేసి ఆ శవంతో ఏకంగా 250 కి.మీ. దూరం వరకు ప్రయాణించాడు. చివరకు తానే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఖమ్మం పట్టణం కేంద్రంగా ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లారీపై తనతోపాటే విధులు నిర్వహిస్తున్న క్లీనర్‌ను ఓ డ్రైవర్ దారుణంగా కొట్టి ఆపై కత్తితో పొడిచి చంపాడు. ఓ పనిమీద కాకినాడ నుంచి కరీంనగర్‌కు లారీలో వచ్చిన వీరిద్దరి మధ్య ఘర్ణణ జరిగి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరు తూర్పు గోదావరి జిల్లాకు చెందినట్టు తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన క్లీనర్ రాజు, డ్రైవర్ నైఫ్ రాజు నూకల లోడు కోసం కాకినాడ నుంచి కరీంనగర్‌కు లారీలో వచ్చారు. పనిముగించుకుని కరీంనగర్ నుంచి కాకినాడకు తిరుగుప్రయాణం చేపట్టారు. అయితే లారీకు పట్టా కట్టే విషయంతో పాటు డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. లారీ యజమాని తనకు డబ్బులు ఇవ్వలేదని డ్రైవర్‌తో క్లీనర్ వాగ్వాదం జరిపినట్లు తెలిసింది.అయితే డ్రైవర్ రాజు మద్యం మత్తులో క్లీనర్ రాజును రాడ్డుతో కొట్టి కత్తితో పొడిచి చంపాడు. తరువాత క్లీనర్ శవాన్ని లారీలో వేసుకుని డ్రైవర్ కాకీనాడకు బయలుదేరాడు. అలా ఖమ్మం పట్టణం దాటిన తరువాత రహదారి పక్కన ఉన్న కొనిజర్ల పోలీస్‌స్టేషన్‌లో శవంతో డ్రైవర్ లొంగిపోయాడు.
250 కి.మీ. ప్రయాణం చేసిన తురువాత తనంతట తానే లొంగిపోవడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే క్లీనర్ తనను కత్తితో హత్యచేయాలని చూశాడని పోలీసులకు డ్రైవర్ రాజు తెలిపాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికే క్లీనర్‌ను హత్య చేశానని పోలీసులకు తెలిపాడని తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read ;- ఒకరితో ప్రేమపాఠాలు.. ఆరుగురితో వలపు పాఠాలు!