దేశమేదైనా మహిళా రక్షణ గురించి మాట్లాడాల్సి వస్తే, ‘గాల్లో దీపం’ అని చెప్పచ్చు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి నరుపయోగం అవుతున్నాయి. ఏ చట్టం కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతుంది. రక్షణ మాట అటుంచితే, అన్యాయం జరిగిన తర్వాతైన త్వరితగతిన స్పందించే చట్టాలున్నాయా అంటే లేవనే చెప్పాలి. నిర్భయ కేసునే పరిశీలిస్తే, 2012 లో జరిగిన సంఘటనకు న్యాయం కోసం దాదాపు 8 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అదీ మన న్యాయ వ్యవస్థ పనితీరు. దీనికి సరికొత్త పరిష్కారం చూపుతాం అంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ‘శక్తి-2020’ పేరుతో కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. అందులో మహిళలకు త్వరగా న్యాయం జరిగేలా చట్టాన్ని రూపుదిద్దింది.
చట్టంలోని విశేషాలివే
మహిళల పట్ల అఘాయిత్యం జరిగిన 15 రోజుల్లో కేసులో పోలీస్ విచారణ పూర్తి చేయాలని చట్టంలో పేర్కోంది. ఒకవేళ బలమైన కారణం ఉంటే ఇంకో 7 రోజుల పాటు విచారణకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఛార్జ్ షీట్, కోర్టు విచారణ రోజు వారిగా జరిపి 30 నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలని చట్టంలో చేర్చింది. తీవ్రమైన నేరానికి ఉరిశిక్ష వేయాల్సిందిగా కూడా చట్టంలో చేర్చింది. కేవలం మహిళలే కాదు, చిన్నపిల్లల పట్ట జరుగుతున్న అన్యాయలకి కూడా ఈ చట్టం వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది.
వింటుంటే ‘దిశ’లా ఉందే
ఈ శక్తి చట్టం-2020 లోని విషయాలు వింటుంటే ఏపీ లోని ‘దిశ’ చట్టం గుర్తుకురాకమానదు. కేవలం చట్టమే కాదు దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కానీ, చివరికి చట్టం అసలు అమలులోకి రాకముందే అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వ చట్టానికి కేంద్రం ఆమోదం లభించలేదు. నిర్భయా చట్టానికి లోబడే రాష్ట్ర మహిళా చట్టాలు ఉండాలని, దానికి అనుగుణంగా మార్పులు చేయండని బిల్లుని తిరిగిపంపింది కేంద్రం. అక్కడితో రాష్ట్ర ప్రభుత్వ దిశ చట్టం దశ లేని దిశగా మారింది. అన్ని మార్పులను తీసేసి కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కేసు నడుపుకోవడానికి మాత్రమే అనుమతి ఉన్నట్లుగా పేర్కోని బిల్లును పాస్ చేసేసుకుంది ఏపీ ప్రభుత్వం.
ఈ ‘శక్తి’ అయినా రక్షణ కల్పిస్తుందా
పేరులో ఏముంది, పని తీరులో ఉంటుంది. శక్తి అని పేరు పెట్టి చాలా శక్తమంతమైన కూర్పలతో బిల్లును రూపొందించింది మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ అది అములులోకి వస్తుందా లేక దిశ చట్టంలా అటకెక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ అమలులోకి వచ్చినా, అది మహిళలకి ఎంత వరకు సత్వర న్యాయం కల్పిస్తుందో చూడాలి. మన దేశంలో ఇలాంటి చట్టాలు రావడం కొత్తేమీ కాదు, మహిళలకు రక్షణ కల్పించే పేరుతో ఎన్నో వచ్చాయి. వాటిలో ఇంతవరకు 100 శాతం అమలైనవి, న్యాయం కల్పిస్తున్నవి కనీసం ఒక్కటైనా ఉందా అంటే ఆలోచించాల్సి రావడం మన దురదృష్టకరం. కనీసం ఈ చట్టమైనా అములుకు నోచుకుని, మహిళలకు న్యాయం చేస్తుందేమో చూద్దాం.