(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
స్థానిక ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ విశాఖ సింహాచలం దేవస్థానం భూముల వివాదం అనూహ్యంగా తెరపైకి వస్తోంది. ప్రభుత్వాలు ఆడే ఈ వింత నాటకం ప్రజలకు కొత్తేమీ కాదు. విశాఖ లోని 4 నియోజకవర్గాలు, పాతిక పైగా వార్డులలో ప్రజలకు సంబంధించిన పంచ గ్రామాల భూ వివాదం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఈ భూ సమస్యలపై శనివారం మంత్రులు, అధికారులు కీలక భేటీ ఉండడమే అందుకు కారణం.
అయితే ఎప్పటిలాగే కోర్టు పరిధిలో ఉందని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తోందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కమిటీ ‘మమ’.. అనిపించింది. అటు దేవస్థానానికి నష్టం లేకుండా, ఇటు భూ ఆక్రమణ దారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సమావేశం అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. గతంలో ప్రభుత్వం గుర్తించిన ఐదు వందల ఎకరాలకు తోడు మరో ఐదు వందల ఎకరాల భూమిని సేకరించి దేవస్థానానికి అప్పగించేలా ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే..
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, పెందుర్తి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జిల్లా కలెక్టర్ తో కూడిన కమిటీని నియమించి భూ సమస్యలపై చర్చించారు. ఇది జరిగి సుమారు ఏడాది కాలం గడుస్తోంది. అప్పటి నుంచి ఆ ఊసే ఎత్తని ప్రభుత్వం తాజాగా మరోమారు భేటీ అయ్యింది.
స్థానిక ఎన్నికల ప్రకటనలతో …
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టుదలగా ఉండటంతో, కాదు … కుదరదు అంటూనే.. ప్రభుత్వం కూడా తన వంతు సన్నాహాలు చేసుకుంటోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. బెంగుళూరు మహాపాలికే ఎన్నికలను నిర్వహించాలని… ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆలస్యం చేయడం సాధ్యం కాదని అక్కడి హైకోర్టు ఆదేశించింది. నేడు రేపో ఆంధ్రలోనూ అదే పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వానికి ముందే తెలిసినప్పటికీ.. పంతం నెగ్గించుకునే దిశగా ముందుకు వెళుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల కాలపరిమితిని తగ్గిస్తూ ఇప్పటికీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.
ఇక స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, పార్టీ నష్టపోకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతోంది. అందులో భాగంగా జీవీఎంసీ ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహించాల్సి రావచ్చు. ఎన్నికల్లో కీలకంగా ఉండే అంశం పంచ గ్రామాల దేవస్థానం భూ సమస్య. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో గత ప్రభుత్వాలు సఫలమయ్యాయి. అదే అస్త్రం మరోమారు వైఎస్ఆర్సీపీ కూడా ప్రయోగించి మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా, విశాఖ పశ్చిమ, తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ దేవస్థానం భూ వివాదం నడుస్తోంది. దీంతో ఈ పరిధిలోని వార్డులు చేజారకుండా పంచ గ్రామాల్లో భూ సమస్యలపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసుకుంది.
మొన్నటి వరకు భూ సమస్య వివాదం కోర్టు పరిధిలో ఉందని, స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించి, పీఠాధిపతులు వేసిన కేసును ఉపసంహరించుకునేలా, కోర్టు అనుమతితో పరిష్కరిస్తామని మంత్రి ముత్తంశెట్టి లెక్కలేనన్ని సార్లు చెప్పారు. ఆ ప్రయత్నాలు మానేసి… మంత్రులు, అధికారులు భేటీ అవ్వడం వెనుక మతలబు ప్రజలను మభ్య పెట్టడం తప్ప.. మరొకటి కాదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: లక్ష్మీనారసింహుని; రథం చుట్టూ రాజకీయం











