ఓ సక్సెస్ ఇస్తే వెంటనే ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వడం మహేష్ కు అలవాటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి
ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు మహేష్. ఎంతోమంది దర్శకులకు రెండో ఛాన్స్ ఇచ్చాడు. కానీ దాన్ని
దుర్వినియోగం చేసుకున్నోళ్లే ఎక్కువ. అలా మహేష్ కు రెండోసారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులంతా ఇప్పుడు ఇంకోసారి అతడితో సినిమాలు చేస్తామంటున్నారు. వాళ్లు చెప్పడం ఓకే. మరి మహేష్ ఛాన్స్ ఇస్తాడా అనేది టాక్.
రీసెంట్ గా శ్రీనువైట్ల ఓ ప్రకటన చేశాడు. ఎప్పటికైనా మహేష్ తో మరో సినిమా చేస్తాననేది అతడి స్టేట్ మెంట్. దీనికి సంబంధించి తన దగ్గర ప్రణాళికలు కూడా ఉన్నాయంటున్నాడు ఈ దర్శకుడు. గతంలో మహేష్ కు దూకుడు లాంటి హిట్టిచ్చాడు వైట్ల. దీంతో ఆ వెంటనే మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. కానీ వైట్ల దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడు. ఆగడు రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. ఇప్పుడీ దర్శకుడికి మహేష్ మరో ఛాన్స్ ఇస్తాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
గుణశేఖర్ కూడా మహేష్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రీసెంట్ గా ఓ ఛానెల్ కు వర్చువల్ గా ఇంటర్య్యూ ఇచ్చిన గుణశేఖర్.. మహేష్ తో గ్యారెంటీగా మరో సినిమా చేస్తానంటున్నాడు. ఇంతకుముందు తామిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని కూడా చెబుతున్నాడు. ఒక్కడుతో గుణకు ఛాన్స్ ఇచ్చాడు మహేష్. ఆ తర్వాత సైనికుడు, అర్జున్ సినిమాలతో కూడా అవకాశాలిచ్చాడు. కానీ గుణ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు మరో చాన్స్ అంటే మహేష్ చూడకపోవచ్చు.
ఈ డైరక్టర్స్ లిస్ట్ లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఉన్నాడు. మహేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు అడ్డాల. ఆ సినిమా టైమ్ లో శ్రీకాంత్ అడ్డాల వర్కింగ్ స్టయిల్ మహేష్ కు బాగా నచ్చింది. అందుకే బ్రహ్మోత్సవం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ శ్రీకాంత్ అడ్డాల మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా దెబ్బకు ఫేడవుట్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడీ దర్శకుడు అవకాశం ఇస్తే మహేష్ కు తప్పకుండా హిట్ ఇస్తానంటున్నాడు.
ఇప్పటివరకు మనం చెప్పుకున్న దర్శకుల సంగతేమో కానీ ఓ డైరక్టర్ కు మాత్రం మహేష్ మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. అతడే పూరి జగన్నాధ్. ఎన్ని ఫ్లాపులిచ్చినా వెంటనే మరో హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వడం ఈ దర్శకుడి స్టయిల్. మరీ ముఖ్యంగా మహేష్ తో ఇతడిది మంచి ట్రాక్ రికార్డ్. పోకిరితో సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు. బిజినెస్ మేన్ తో మరో డీసెంట్ హిట్ అందించాడు. కాబట్టి పూరికి మరో ఛాన్స్ ఇవ్వడానికి మహేష్ కు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కాకపోతే పూరి చెప్పే కథలు మహేష్ కు నచ్చడం లేదు. అదొక్కటే సమస్య. వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన జనగణమన అనే ప్రాజెక్టు అగిపోయింది కూడా ఇందుకే.