కుర్ర హీరోలతో పోటీపడే సీనియర్ స్టార్ హీరోలలో నాగార్జున ముందుంటారు. ఇక పై కూడా ఆయన అదే జోరును కంటిన్యూ చేయడానికి రెడీ అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా అంతా ఇంటిపట్టునే ఉంటే, ఆ సమయాన్ని నీట్ గా ‘బిగ్ బాస్’ సీజన్ 3కి కేటాయించి ‘ఔరా’ అనిపించారు. అంతేకాదు ‘బిగ్ బాస్’ గ్యాప్ లో ‘వైల్డ్ డాగ్’ షూటింగును కూడా పూర్తిచేశారు. లాక్ డౌన్ కాలాన్ని చాలావరకూ సద్వినియోగం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అలాంటి నాగార్జున ఇక ఇప్పుడు తన స్పీడ్ మరింత పెంచడానికి సిద్ధమవుతున్నారు.

నాగార్జున రెండు సినిమాలను అంగీకరించారు .. అందులో ఒకటి ప్రవీణ్ సత్తారు సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇది ఇంతవరకూ నాగార్జున చేయని రోల్ అని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్ తో ఆయనను ప్రవీణ్ సత్తారు చూపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం ప్రవీణ్ సత్తారు .. అనిఖ సురేంద్రన్ ను టెస్ట్ కట్ చేసినట్టుగా తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ .. మలయాళ భాషల్లో అనిఖ సురేంద్రన్ కు మంచి పేరు ఉంది. ‘విశ్వాసం’ సినిమాలో అజిత్ కూతురుగా చేసిన అమ్మాయి ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా గుర్తుండిపోయింది.
నాగార్జున సినిమా కోసం ఈ అమ్మాయిని ప్రవీణ్ సత్తారు ఓకే చేశాడని చెబుతున్నారు. ఈ అమ్మాయి టీనేజ్ లో ఉంది కనుక, ఒక ముఖ్యమైన పాత్రకోసం తీసుకున్నారనే అనుకోవాలి. నాగార్జున సరసన నాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఆ తరువాత సినిమాగా నాగార్జున ‘బంగార్రాజు’ చేయనున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో ఓ యంగ్ హీరో కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో మెప్పించనుంది. వచ్చే ‘సంక్రాంతి’కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.











