‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ తన సత్తా చాటుకున్నాడు. సున్నితమైన అంశాలతో కూడిన కథలను చక్కగా తెరకెక్కించగలడనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఒక వైపున తన కథలకు సంబంధించిన కసరత్తు చేస్తూనే, మరో వైపున నటుడిగా కూడా బిజీ అయ్యాడు. అలాంటి తరుణ్ భాస్కర్ .. ఈ సారి వెంకటేశ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.
తరుణ్ భాస్కర్ తాను లాక్ డౌన్ లో రెండు కథలను సిద్ధం చేశాననీ, ఆ రెండు కథలను ముందుగా సురేశ్ బాబుకి వినిపించానని చెప్పాడు. ఈ రెండు కథలను సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మించడానికి ఆయన అంగీకరించాడని అన్నాడు. అందులో ఒక కథను వెంకటేశ్ తో చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమోషనల్ డ్రామాగా ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ కథ వినగానే వెంకటేశ్ ఒప్పుకున్నాడట .. అందుకు కారణం కథలోని వైవిధ్యం అని చెబుతున్నారు. వెంకటేశ్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
వెంకటేశ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘నారప్ప’ రెడీ అవుతున్నాడు. వెంకటేశ్ లుక్ .. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన ‘ఎఫ్ 3’ చేస్తున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఆగస్టులో ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లకు రానుంది. అందువలన జూలైలో తరుణ్ భాస్కర్ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.