మలయాళంలో ఒకే ఒక్క సినిమాలోని ఒకే ఒక్క సీన్ లో కన్నుకొట్టి.. కుర్రాళ్ళ హృదయాల్ని కొల్లగొట్టింది మల్లూ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా ఇంకా విడుదలవకుండానే అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ‘ఒరు అడార్ లవ్’ అనే ఆ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ గా విడుదలైంది. అయితే సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోవడంతో ఆ తర్వాత ఆమెకి మలయాళంలో అంతగా ఆఫర్స్ రాలేదు. అందుకే అమ్మడి కన్ను టాలీవుడ్ మీద పడింది.
ప్రస్తుతం నితిన్, చంద్రశేఖర్ ఏలేటి క్రైమ్ థ్రిల్లర్ ‘చెక్’ మూవీలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది ప్రియా. ఇందులో ప్రధాన కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇక ఇప్పుడు ప్రియా వారియర్ మరో తెలుగు సినిమాలో కూడా అవకాశం అందుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఓ బేబీ మూవీలో సమంతా మనవడిగా నటించి మెప్పించిన తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో ప్రియా వారియర్ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం.
బాలనటుడిగా మెప్పించిన తేజా ..ఆల్రెడీ జాంబీ రెడ్డి అనే జాంబీ థ్రిల్లర్ లో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్బీ చౌదరి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మల్లూ బ్యూటీస్ అందంలోనూ, అభినయంలోనూ అందరికన్నా ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం చాలా మంది మలయాళ భామలు టాలీవుడ్ లో టాప్ లీడ్ లో ఉన్నారు. మరి వారి జాబితాలోకి ప్రియా వారియర్ కూడా చేరుతుందేమో చూడాలి.