ప్రస్తుతం దగ్గుబాటి రానా రెండు సినిమాల్ని విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. తమిళ దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్య’ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది. లాక్ డౌన్ కారణం వాయిదా పడింది. అలాగే వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘విరాటపర్వం’ కూడా ఈ పాటికి విడుదల కావాల్సిన సినిమానే. ఇక అతగాడి తదుపరి చిత్రాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ తో మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీలో మరో హీరోగా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే.. బాబాయ్ వెంకీతో కూడా అతడు ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొత్తగా అతడు మరో మూవీ కి కమిట్ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
సిద్ధార్ధ హీరోగా తెలుగులో తెరకెక్కించిన గృహం మూవీతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మిలింద్ రావు. ఔట్ అండ్ ఔట్ హారర్ గా భయపెట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది. ఇప్పుడు ఈ దర్శకుడు దగ్గుబాటి రానా హీరోగా ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ‘ధీరుడు’ టైటిల్ తో ఈ సినిమా రూపొందనుందట. సూపర్ నేచురల్ కథాంశంతో ఈ సినిమా రానుందట. రానా ఇంతకు ముందు ఈ తరహా కథాంశంతో సినిమా చేయలేదు. మిలింద్ రావు చెప్పిన స్టోరీ లైన్ రానాకి బాగా నచ్చిందట.
రీసెంట్ గా పెళ్ళిచేసుకున్న రానా ప్రస్తుతం హానీమూన్ సందడిలో ఉన్నాడు. అది ముగియగానే రానాకి పూర్తి స్ర్కిప్ట్ వినిపించనున్నాడట మిలింద్ . వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుందట. గతంలో విశాల్ నటించిన ‘పట్టత్తుయానై’ అనే తమిళ చిత్రం ధీరుడు పేరుతోనే తెలుగుతో అనువాదమైంది. ఆ సినిమా అప్పట్లో తెలుగు వారిని బాగానే అలరించింది. ఇప్పుడు మరోసారి అదే టైటిల్ తో రానా రానుండడం విశేషంగా మారింది. మరి ధీరుడుగా రానా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.