ఆశ్చర్య పరుస్తున్న అధిష్టానం చర్యలు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా ఎవరు ఉంటే బాగుంటుంది అంటూ వైసిపి అధిష్టానం సర్వే.
కొత్తగా పార్టీలో చేరబోతున్న నేతల లిస్ట్ తో పాటు పార్టీలో ఎంతో కాలంగా ఉంటున్న నేతల పేర్లతో సర్వే.
పార్టీ అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన పీకే టీం.
లోకేష్ పై సరైన అభ్యర్థిని దింపే యోచనలో వైసిపి అధిష్టానం.
తాడికొండ తరహాలో మంగళగిరికి అదనపు ఇంఛార్జ్ త్వరలోనే రానున్నారా?
రెండు సార్లు ఎమ్మెల్యే, తన నీడని కూడా తాను నమ్మని వైనం, సొంత సామాజిక వర్గానికి కూడా దూరమైన విభిన్నమైన వ్యవహార శైలి, ప్రజల్లో వ్యతిరేకత, క్యాడర్ లో అసంతృప్తి, ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆగ్రహ జ్వాలలు అన్ని వెరసి మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే కి అధిష్టానం మంగళం పాడే రోజు దగ్గర పడిందని విశ్వసనీయ సమాచారం. పీకే ఇచ్చిన సర్వే రిపోర్ట్ తో వైసిపి అధిష్టానం అలెర్ట్ అయ్యింది. తాడికొండ తరహా లో మంగళగిరి లో అదనపు ఇంఛార్జ్ ని నియమించే రోజు అతి దగ్గరలోనే ఉంది. గత వారం రోజులుగా మంగళగిరిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఛాయ్ దుకాణాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, కాలనీలు ఇలా అన్ని చోట్లా పీకే టీం హాల్చల్ చేస్తుంది. మరో పక్క టెలిఫోన్ సర్వే కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దరి తీస్తుంది. పీకే టీం సర్వే ఆర్కే టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది. లోకేష్ ని ఎదుర్కునే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అంటూ పీకే టీం నియోజకవర్గాన్ని జల్లెడ పడుతుంది. ఈ సర్వే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సర్వే లిస్ట్ లో ఉన్న పేర్లు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే ఆర్కే, ఆప్కో ఛైర్మెన్ చిల్లపల్లి మోహన్ రావు, ఇటీవల టిడిపి ని వీడి ఇంకా పార్టీలో చేరని గంజి చిరంజీవి, కండువా కప్పుకోకుండానే ఎమ్మెల్సీ తెచ్చుకొన్న నేత బంధువైన మహిళా నేత ఇలా అర డజను పేర్లతో పీకే టీం మంగళగిరి లో సర్వే చేస్తుంది. వీరి సర్వే ఆధారంగా త్వరలోనే మంగళగిరి కి అదనపు ఇంఛార్జ్ ని నియమించే యోచనలో అధిష్టానం ఉంది. అయితే సర్వే లో వస్తున్న ఫలితాల పైనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. పీకే సర్వే లో ఇప్పటికే వెనుక పడిన ఆర్కే మరోసారి చేస్తున్న సర్వే లో కూడా వెనుక పడ్డారని సమాచారం. ఇక ఇంకా పార్టీలో చేరని గంజి విషయంలో కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కనీసం 5 వేల మందికి పార్టీలో చేరే సత్తా ఉందా అన్న ప్రశ్న కి రెండు, మూడు సున్నాలు తగ్గించుకోండి అని వచ్చిన సమాధానం పీకే టీం ని డోలాయమానం లో పడేసింది. అర డజను కు పైగా పేర్లతో సాగుతున్న ఈ సర్వే లో అనూహ్యంగా ఆప్కో ఛైర్మెన్
చిల్లపల్లి మోహన్ రావు పేరు తెర పైకి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆప్కో ఛైర్మెన్, క్లీన్ ఇమేజ్, కుటుంబానికి ఉన్న మంచి పేరు, సజ్జల అండదండలు చిల్లపల్లి కి కలిసొచ్చిన అంశాలు అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇతర పార్టీల నుండి నాయకుల్ని చేర్చుకోవడం, అభ్యర్థి మార్పు, అదనపు ఇంఛార్జ్ నియామకం లాంటి చర్యలతో నిస్తేజంగా ఉన్న క్యాడర్, లీడర్స్ లో మళ్ళీ ఉత్సాహం నింపాలని వైసిపి అధిష్టానం సీరియస్ గానే కసరత్తు చేస్తుంది. ఈ మార్పులు పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి. కొత్తగా చేరాలి అనుకుంటున్న నేతల పయనం ఎటు వైపు అనే అంశాలు రానున్న రోజుల్లో ఆసక్తిగా మారనున్నాయి.