వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఒకదాని తర్వాత మరోకటి అన్నట్లు వరుస సినిమాలను ఎంపికచేసుకుంటూ.. మిగిలిన అగ్ర హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఆఫ్టర్ లాక్ డౌన్ .. ఈ సినిమా షూటింగ్ తిరిగి త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ సినిమా తర్వాత చిరు రెండు రీమేక్ సినిమాలలో నటించనున్నారు. వీటిలో ఒకటి మోహన్ లాల్ హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కాగా, మరొకటి తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’. ‘లూసిఫర్’ రీమేక్ కు వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు రైటర్ ఆకుల శివ సిద్ధం చేసాడు. ఇక ‘వేదాళం’ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆయన కూడా కథను పక్కాగా రెడీ చేసుకున్నాడు.
ఈసారి మెగాస్టార్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెహర్ రమేష్. ఈ రెండు సినిమాలు ఒకేసారి వచ్చే ఏడాదిలో షూటింగ్లు మొదలవుతాయని తెలుస్తోంది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ మీద కూడా కన్నేసినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. 2015లో వచ్చిన ఈ చిత్రం అజిత్ ను మరోసారి తిరుగులేని స్టార్ గా నిలబెట్టింది. ఇదే సినిమా అప్పట్లో తెలుగులో ‘ఎంత వాడుగానీ’ పేరుతో డబ్బింగ్ అయింది కూడా.
ఇప్పుడీ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి మక్కువ చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘వేదాళం’, ‘లూసిఫర్’ సినిమాలను పూర్తి చేసి తదుపరి ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ వెర్షన్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చిరు భావిస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగితే తమిళంలో ‘ఎన్నై అరిందాల్’ను నిర్మించిన ఏ.ఎం. రత్నం తెలుగులో కూడా చిరుతో నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ వార్తపై ఫుల్ క్లారిటీ రావాలంటే కొన్ని నెలలు ఆగాల్సిదే మరి.











