భారత క్రీడారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పుటను క్రియెట్ చేసుకున్న పరుగుల వీరుడు మిల్కా సింగ్… కరోనా బారిన పడి దాని నుంచి కోలుకుని చివరకు ఇతర అనారోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిల్కా సింగ్ అంత్యక్రియల సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన సతీమణి నిర్మల్ కౌర్ చిత్రపటాన్ని తన గుండెలపై పెట్టుకుని చేతులతో గట్టిగా పొదివి పట్టేకుసున్నట్లుగా చితిపైకి మిల్కా సింగ్ చేరాడు. భార్యపై మిల్కా సింగ్ కు ఏ మేర ప్రేమ ఉందన్న విషయాన్ని ఈ చిత్రం చెప్పకనే చెబుతోంది. విగత జీవిగా చితిపైకి చేరిన మిల్కా సింగ్ గుండెలపై ఆయన భార్య ఫొటో పెట్టిన వారి కుమారుడు జీవ్ మిల్కా సింగ్.. తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు.
మిల్కా గుండెలపై నిర్మల్ కౌర్ ఫొటో
ఛండీగఢ్ లో పూర్తిగా అధికార లాంఛనాలతో శనివారం మిల్కా సింగ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా మిల్కా సింగ్ గుండెలపై నిర్మల్ ఫొటో కనిపించిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. తన గుండెలపై తన భార్య ఫొటోను మిల్కా సింగ్ చేతులతో గట్టిగా పొదివి పట్టుకున్నట్లుగా సదరు ఫొటో కనిపించింది. 91 ఏళ్లలో మృతి చెందిన మిల్కా సింగ్… క్రీడాకారిణి అయిన నిర్మల్ కౌర్ ను పెళ్లాడారు. ఇటీవల విజృంభించిన కరోనాకు తొలుత మిల్కా సింగ్ గురి కాగా… ఆయన వెంటనే నిర్మల్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే తొలుత నిర్మల్ కౌరే మృతి చెందగా… ఆమె చనిపోయిన 5 రోజులకు మిల్కా సింగ్ తుది శ్వాస విడిచారు.
అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమా?
తన తల్లిదండ్రుల అన్యోన్య దాంపత్యాన్ని గుర్తు చేసుకున్న దరిమిలానే మిల్కా సింగ్ కుమారుడు జీవ్… తన తండ్రి గుండెలపై తన తల్లి ఫొటోను పెట్టి మరీ అంత్యక్రియలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. లేదంటే… మిల్కా సింగే అలా కోరారేమో మనకు తెలియదు. కారణమేదైనా… నిర్జీవంగా చితిపైకి చేరుతున్న సమయంలో మిల్కా సింగ్ గుండెలపై ఆయన సతీమణి ఫొటో చేరడం… అలానే ఆయన పార్ధీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడం పలువురిని కంట తడి పెట్టించింది.
Must Read ;- కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కా. రా. మాస్టారు మృతి











