ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన తీరుపై లెక్కలేనన్ని విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఈ హత్యోదంతం వెనుక గల కారణాలేమిటో ఇప్పటిదాకా తెలియదు గానీ… ఎవరికి తోచిన విధంగా వారు కథలు అల్లేసుకుంటున్నారు. అయితే సీఎం బాబాయి, అందునా పెద్దగా వివాదాల్లోకి వెళ్లని వివేకాను అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అలాంటి అవసరం ఎవరికి ఉంది? అన్న కోణంలో ఆలోచిస్తే… ఈ కేసు ఓ చిక్కుముడిగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ గడచిన 13 రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. విచారణలో భాగంగా రోజుకో కొత్త వ్యక్తి తెర మీదకు వస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
గంగిరెడ్డితో పాటు మరింత మంది
ఇప్పటిదాకా ఈ కేసు విచారణకు హాజరైన వారి విషయానికి వస్తే… వివేకాకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ ఎర్ర గంగిరెడ్డి ఈ కేసు విచారణకు వరుసగా హాజరవుతున్నారు. అసలు వివేకా హత్యకు ముందు ఆయనతో పాటు కలిసి తిరిగిన వ్యక్తిగా, హత్య జరిగిన తర్వాత ఘటనా స్తలిలో రక్తపు మరకలు కడిగిన వ్యక్తిగా గంగిరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఇదివరకటి దర్యాప్తులో భాగంగా ఆయన అరెస్టై కొన్ని రోజుల పాటు జైల్లో కూడా ఉండి వచ్చారు. తాజాగా సీబీఐ కూడా గంగిరెడ్డిని వరుసగా విచారణకు పిలుస్తోంది. గంగిరెడ్డిని విచారించడానికి ముందు… సీబీఐ అధికారులు వివేకా మాజీ డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ లను కూడా విచారించారు. ఇక పులివెందులకే చెందిన వైసీపీ యువ నేత కిరణ్ కుమార్ యాదవ్, అతడి సోదరుడు, అతడి తండ్రి… ఇలా ఒకే కుటుంబంలో ఏకంగా ముగ్గురు వ్యక్తులను పిలిచిన సీబీఐ అధికారులు.. వీరిని రోజుల తరబడి విచారించింది. అయితే ఈ విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూశాయో తెలియదు గానీ… వీరి విచారణ తర్వాత సీబీఐ అధికారులు కొత్త వ్యక్తులను తెర మీదకు తెస్తున్నారు.
తెర మీదకు కొత్తగా ఓ మహిళ
ఇలా కొత్తగా తెర మీదకు వచ్చిన వారిలో వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి మహేశ్వరిలను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా కేసులో ఇప్పటిదాకా ఓ మహిళ పేరు వినిపించడం చూస్తుంటే… కేసు ఇంకెన్ని మలుపులు తీరుగుతుందోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. తొలుత జగదీశ్వర్ రెడ్డిని విచారించిన అధికారులు… ఆ విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగానే మహేశ్వరిని విచారణకు పిలిచినట్టుగా సమాచారం. ఇక మహేశ్వరిని విచారణకు పిలిచిన రోజే… పులివెందులకే చెందిన గని యజమాని గంగాధర్ కూడా సీబీఐ విచారించింది. పులివెందులకే చెందిన కాఫీ పొడి వ్యాపారీ సుగుణాకర్, కడపకు చెందిన మోహన్ ఆసుపత్రి యజమానికి లక్ష్మీరెడ్డిలతో పాటు చిన్నపరెడ్డి, రామచంద్రారెడ్డి అనే వ్యక్తులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కన్‌క్లూజన్ ఎప్పుడు?
రోజుకో కొత్త వ్యక్తి తెర మీదకు వస్తున్నా… వివేకా హత్య కేసు మిస్టరీ వీడటం లేదన్న విషయంపై పలు రకాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన తర్వాత నిర్జీవంగా పడి ఉన్న వివేకా ఫొటోలను ఆయన కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లానే తొలుత తీశారట. అంటే… ఘటనా స్థలిలో రక్తపు మరకలు చెరిపేయడం, మృతదేహాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలించడం, ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు జరిగిన యత్నం… తదితరాలన్నీ అతడికి తెలిసే ఉంటాయన్న వాదనలు రేకెత్తాయి. అయితే అతడిని ఏకంగా నాలుగైదు రోజులు విచారించినా అసలు విషయం బయటకు రానట్టుగానే తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా ఓ మహిళ తెర మీదకు రావడం, ఆమె భర్త, వివేకాకు పొలం పనుల్లో అంతా తానై వ్యవహరించే జగదీశ్వర్ రెడ్డిని రోజుల తరబడి విచారిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా వివేకా హత్య కేసు మిస్టరీ అసలు వీడుతుందా? మిస్టరీగానే మిగిలిపోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Must Read ;- సోదరికే రక్షణ లేకపోతే.. డాక్టర్ సునీతారెడ్డికి ఎవరి నుంచి ప్రాణ హాని?